( నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి)
తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కృషి చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. సురవరం అంటేనే ఒక వెలుగు. ఆయన తెలంగాణకు ఒక వరం. చరిత్ర ఉన్నంతకాలం వీరి పేరు ప్రతి ఒక్కరి మదిలో మార్మోగుతూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి మారు పేరైన సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో జన్మించారు. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి ఎనలేనిది.
తెలంగాణలో 354 కవులతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే విమర్శకులకు సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక నూతన అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పట్టు అధికం. గోలకొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం ఆయన ఇతర ముఖ్య రచనలు.
జాతీయ ఉద్యమ ప్రభావం
నైజాం నిరంకుశ పాలనలో.. తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశాడు. జీవిత చివరిదశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకుగాను ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ అవార్డు లభించింది.
సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించారు. ఆయన చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏ చదివాడు.
1916లో వివాహం చేసుకున్నాడు.సంతానం పదిమంది కాగా, ఇద్దరు కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురు పుత్రికల సంతానం. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్ కొత్వాల్‌గా ఉన్న రాజబహదుర్ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు అతను కోరికపై వచ్చాడు. ఇక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దాడు. ఆ విధంగా హైదరాబాద్‌లో సాంఘిక సేవాజీవితం పునాదులు వేసింది. మద్రాస్ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడింది.
గ్రంథాలయోద్యమంలో కీలక పాత్ర
రెడ్డి హాస్టల్ కార్యదర్శిగా వచ్చాక, వేయి గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరీని 11వేల గ్రంథాల వరకు పెంచి విద్యార్థులలో భాషాభివృద్ధికి కృషి చేశాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ, తిరువాన్‌కూరులో బీఎల్ చదివాడు. కొంతకాలంపాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి పండితుడు. 1926లో అతను నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినాయి.
నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది. గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి కీలక పాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు.
1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు. 1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
భాషా వికాసానికి గోలకొండ పత్రిక
ప్రతాపరెడ్డి భావుకతున్న రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంసలు పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు.
1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోలకొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా, పాలనా భాషగా, వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది. సురవరం ఆగస్టు25, 1953లో మరణించాడు. వీరి రచనల ద్వారా ప్రతి ఒక్కరు స్ఫూర్తిని పొందాలి. ప్రతి రచయిత, పాత్రికేయులు ప్రతాపరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సామాజిక సమస్య ల మీద రచనలు చేయాలి.
- కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి