నిమ్స్ లో వైద్య సేవలు మెరుగుపర్చాలి : సురవరం సుధాకర్ రెడ్డి

  • రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై 
  • స్పష్టత ఇవ్వాలి 
  • సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి

అలంపూర్, వెలుగు: నిమ్స్ ఆస్పత్రిని మెరుగు పరిచి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందు బాటులోకి తేవాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడులో బుధవారం తన ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అతి సమీపంలో కర్నూలు సిటీకి ఇక్కడి ప్రజలు పోతుండగా.. వేరే రాష్ట్రం అయినందున మన ప్రభుత్వ ఆరోగ్యశ్రీ చెల్లకపోవడంతో  ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలంపూర్ చౌరస్తాలో 3 ఏండ్ల కింద  రూ. 27 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనం నిర్లక్ష్యానికి గురై అసాంఘిక కార్యకలాపాలకు  అడ్డగా మారిందన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి  ఆస్పత్రిలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై రైతులకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆర్‌‌‌‌డీఎస్‌‌‌‌ కెనాల్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలోని 80వేల ఎకరాలు అందించాల్సి ఉండగా.. వివిధ కారణాలతో 40 వేల ఎకరాలకు కూడా నీళ్లు రావడం లేదన్నారు. ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీల్లో కంపచెట్లు పెరిగిపోవడంతో కొన్ని గ్రామాల రైతులు స్వయంగా వాటిని తొలగించుకున్నారన్నారు.  అలంపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, సరుకుల కొనుగోలు వంటి వాటికి కర్నూలు మీదే ఆధారపడతారని, బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు. మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు సురవరం లోకేశ్​రెడ్డి, మాజీ సర్పంచ్  శేషన్ గౌడ్  పాల్గొన్నారు.