నల్గొండ అర్బన్, వెలుగు: చేనేత వర్గాన్ని రాజకీయంగా అణచి వేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్చెప్పారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్‌లో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబ సభ్యులు దాసు సురేశ్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
పదేండ్లుగా నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ చేనేతను పబ్లిసిటీకి వాడుకుంటున్నాడే తప్ప, ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గడిచిన పదేండ్లలో 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, కేటీఆర్కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదన్నారు.
బీఆర్ఎస్హయాంలో చేనేత రంగం నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మగ్గాల చప్పుడు లేకుండా పోయిందని వాపోయారు. బాధితురాలు కొలను నిర్మల మాట్లాడుతూ.. తమకు పట్టిన గతే కేసీఆర్బిడ్డ కవితకు పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. నేతన్నల బతుకులను రోడ్డున పడేసిన కేసీఆర్, కేటీఆర్ ను ఓడించే దాకా నిద్రపోమని మహిళలు హెచ్చరించారు.
తమ ఉసురు తప్పక తగులుతుందన్నారు. అవసరమైతే సిరిసిల్ల, గజ్వేల్‌లో నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షుడు దొంత ఆనందం, గ్రేటర్హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, కార్మిక సంఘాల నాయకుడు గంజి నాగరాజు, బాధిత మహిళలు పాల్గొన్నారు.