గిరిజన శాఖను అగ్రవర్ణాల నేతలే నిర్వహించాలి.. నటుడు, కేంద్ర మత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు

గిరిజన శాఖను అగ్రవర్ణాల నేతలే నిర్వహించాలి.. నటుడు, కేంద్ర మత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు

మాలీవుడ్ నటుడు, కేంద్ర మత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాలను ఉన్నత వర్గాల నేతలకు అప్పగించాలని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి జరగాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయాలని చెప్పడమే తన ఉద్దేశమని, ఒకవేళ ఎవరినైనా బాధించి ఉంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుటానని అన్నారు. 

అప్పర్ క్యాస్ట్ కు చెందిన వ్యక్తులైతే గిరిజన శాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఢిల్లీ మయూర్ విహార్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. బ్రాహ్మిన్ లేదా నాయుడు అయితే గిరిజన సమస్యలను బాగా పరిష్కరిస్తారని, వారికి ఈ శాఖను అప్పగించడం వలన గుణాత్మక మార్పు తీసుకొస్తారని అన్నారు. 

ట్రైబల్ మినిస్ట్రీపై కన్ను.. 2016 నుంచి ప్రయత్నం:

మంత్రి సురేష్ గోపి ట్రైబల్ మినిస్ట్రీ ని తనకు అప్పగించాలని 2016 నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీకి తన విన్నపాన్ని చెప్పినట్లు తెలిపారు. ‘‘మన దేశంలో గిరిజన శాఖకు మంత్రి కావాలంటే మరో గిరిజన వ్యక్తే కావాల్సి వస్తుంది. ఇతర వర్గాల వారు ఆ శాఖను నిర్వర్తించే పరిస్థితి లేదు. మన దేశంలో ఇదొక శాపం. గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం ఉన్నత వర్గాల నుంచి మంత్రిగా చేయాలి, అప్పుడే మార్పు చూస్తాం.. ఈ మార్పు మన ప్రజాస్వామ్యంలో జరగాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. గిరిజన శాఖను తనకు అప్పగించాలనే తన  మనసులోని మాటను ఈ రకంగా బయట పెట్టారని విమర్శకులు అంటున్నారు.