సురేశ్​ మా పార్టీ కార్యకర్తే.. రోజూ నాతో ఫోన్లో మాట్లాడ్తడు: బీఆర్​ఎస్​ నేత పట్నం నరేందర్​రెడ్డి

పరిగి, వెలుగు: వికారాబాద్​ కలెక్టర్  ప్రతీక్ ​జైన్​పై దాడిలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్​ బీఆర్​ఎస్​ కార్యకర్తేనని ఆ​ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి తెలిపారు. సురేశ్​కు ఏడెకరాల పొలం ఉందని, ఫార్మా కంపెనీతో పొలం పోతుందన్న ఆవేదనతో అందరితో కలిసి పబ్లిక్ హియరింగ్​ను బహిష్కరించాడని చెప్పారు. పబ్లిక్​ హియరింగ్​ను బాయ్​కాట్​ చేసినవాళ్లలో బీఆర్​ఎస్​ కార్యకర్తలతోపాటు కాంగ్రెస్​, బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారని.. కేవలం బీఆర్​ఎస్​ వాళ్లనే ఎందుకు టార్గెట్​చేస్తున్నారని నరేందర్​రెడ్డి ప్రశ్నించారు. 

లగచర్ల ఘటనలో మంగళవారం రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్​ లీడర్లు మధుసూదనాచారి, పట్నం నరేందర్​రెడ్డి, ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ తదితరులను మన్నెగూడ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్​రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా సిటీకి భూములు ఇవ్వలేమని ఆరునెలలుగా సీఎంకు రైతులు చెప్తూ వస్తున్నారని తెలిపారు. కలెక్టర్​పై జరిగిన దాడికి సీఎం నిర్ణయాలే కారణమని దుయ్యబట్టారు. ‘‘కొడంగల్​ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు సీఎం సోదరుల కోసమా? బామ్మర్ది కోసమా?’’ అని ప్రశ్నించారు. 

‘‘ఫార్మా కంపెనీ భూబాధితులు అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి ఇవ్వలేమని సర్కారును హెచ్చరిస్తున్నారు. కలెక్టర్​పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి తప్ప రైతులను కాదు” అని ఆయన అన్నారు. ‘‘లగచర్లలో పబ్లిక్​ హియరింగ్​ బహిష్కరణ టైమ్​లో అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నరు. మా పార్టీ యువ నాయకుడు సురేశ్​  కూడా ఉన్నడు. ఫార్మా సిటీలో తన ఏడెకరాల భూమి పోతుందన్న బాధ ఆయనకూ ఉంది. అన్ని పార్టీలతో కలిసి పబ్లిక్​ హియరింగ్​ను బాయ్​కాట్​ చేసిండు. అట్లాంటిది మా కార్యకర్తనే ఎందుకు టార్గెట్​ చేస్తున్నరు? సురేశ్ మాతోని రోజు వివిధ పనుల గురించి మాట్లాడ్తనే ఉంటడు. భూ సేకరణను గ్రామంలో బహిష్కరిస్తున్నమని నాతో చెప్పిండు. బహిష్కరించాలని నేను చెప్పిన. శాంతియుతంగా బహిష్కరించాలన్న. వాళ్లు బహిష్కరించిన తర్వాత కలెక్టర్​ గ్రామానికి పోయిండు. అట్ల పోవడం వల్లే గొడవ జరిగింది” అని నరేందర్​రెడ్డి వివరించారు. 

ఆఫీసర్లను బీఆర్​ఎస్​ కంటికిరెప్పలా కాపాడింది: ఆర్​ఎస్​ ప్రవీణ్​

అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి కవచంలా  వాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ దుయ్యబట్టారు. పోలీసులను నమ్ము కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని రోజులు పాలిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులను కంటికి రెప్పలా కాపాడుకుందని చెప్పారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రజల గోడును వినేస్థితిలో ముఖ్యమంత్రి లేరని విమర్శించారు. ప్రజలను నిరాశ్రయులను చేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు.