చిన్నచిన్న విషయాలకు రూ.12.5 కోట్లు వదిలేయలేం కదా

చిన్నచిన్న విషయాలకు రూ.12.5 కోట్లు వదిలేయలేం కదా

బలమైన కారణంతోనే ఇంటికి తిరిగొచ్చా

మళ్లీ యూఏఈకి వెళ్లొచ్చు

నోరు విప్పిన సీఎస్‌‌‌‌కే వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ రైనా

న్యూఢిల్లీ: చెన్నై సూపర్​కింగ్స్(సీఎస్‌‌‌‌కే) బ్యాట్స్​మన్​ సురేశ్ రైనా ఎట్టకేలకు మౌనం వీడాడు. బలమైన కారణాలు ఉండటంతోనే తాను లీగ్​ నుంచి తప్పుకున్నానని చెప్పాడు. ‘ఈ నిర్ణయం నా వ్యక్తిగతం. నా ఫ్యామిలీ కోసమే తిరిగొచ్చా. నేను దగ్గరుండి చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. సీఎస్​కే కూడా నా ఫ్యామిలీయే. మహీ బాయ్​ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. నేను తీసుకున్న నిర్ణయం కఠినమైనదే.. కానీ తప్పలేదు. నాకు, సీఎస్​కేకు మధ్య ఎలాంటి వివాదం లేదు. చిన్నచిన్న విషయాలకు రూ.12.5 కోట్లు వదిలేసి బయటకు రాలేం కదా. బలమైన రీజన్​ ఉంది కాబట్టే అలాంటి డెసిషన్​ తీసుకున్నా. నేను ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్​కు గుడ్​బై చెప్పా. ఇంకా యంగ్​గానే ఉన్నా. మరో నాలుగైదేళ్లు సీఎస్​కేకు ఆడతా’ అని రైనా స్పష్టం చేశాడు. అన్నీ అనుకూలిస్తే మళ్లీ యూఏఈకి తిరిగివెళ్లి టీమ్​తో కలిసినా ఆశ్చర్యం లేదన్నాడు.

ఫ్యామిలీయే ముఖ్యం..

బయోసెక్యూర్​ ఎన్విరాన్​మెంట్​ తనకు నచ్చలేదని వచ్చిన కథనాలను రైనా తోసిపుచ్చాడు. ఐపీఎల్​ కోసం బీసీసీఐ, ఫ్రాంచైజీలు చాలా కష్టపడుతున్నాయన్నాడు. అయితే తనకు ఫ్యామిలీ చాలా ముఖ్యమని చెప్పాడు. ‘ఈ కష్టకాలంలో నా ఫ్యామిలీతో ఉండాలని అనుకున్నా. నా పిల్లలను చూడక 20 రోజులైంది. తిరిగి వచ్చినా నేను క్వారంటైన్​లోనే ఉన్నా. పఠాన్​కోట్​లో మా ఆంటీ వాళ్ల ఫ్యామిలీపై జరిగిన దాడి నన్ను మానసికంగా దెబ్బతీసింది. అది తట్టుకోలేకపోయా. నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని రైనా​ చెప్పుకొచ్చాడు.

శ్రీని.. తండ్రి లాంటివాడు..

సీఎస్​కే ఓనర్​ శ్రీనివాసన్​.. తనకు తండ్రిలాంటి వాడని రైనా అన్నాడు. ‘శ్రీనివాసన్​.. నా హృదయానికి చాలా దగ్గరి వ్యక్తి. నన్ను కొడుకులా చూసుకుంటాడు. ఆయన మాటలను మరో కోణంలోనే అర్థం చేసుకున్నారని నేనూ అనుకుంటున్నా. తండ్రి తన కొడుకును మందలించినట్లు నన్ను అని ఉండొచ్చు. మొదట మాట్లాడినప్పుడు ఆయనకు విషయం తెలియదు. ఆ తర్వాత మేమిద్దం చర్చించుకున్నాం. ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నాం’ అని రైనా స్పష్టం చేశాడు.

For More News..

లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీ