లగచర్ల దాడి కేసులో సురేశ్ సరెండర్..కొడంగల్ కోర్టులో లొంగుబాటు 

  • కలెక్టర్​పై దాడి కేసులో ఏ2
  • 14 రోజులు రిమాండ్ విధించిన జడ్జి
  • ఆరు బృందాలతో ఎనిమిది రోజుల పాటు గాలించినా దొరకని నిందితుడు

హైదరాబాద్/కొడంగల్‌‌, వెలుగు: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడైన భోగమోని సురేశ్ రాజ్‌‌ మంగళవారం కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. దాడి తర్వాత గత ఎనిమిది రోజులుగా సురేశ్ తప్పించుకుని తిరిగాడు. బీఆర్‌‌‌‌ఎస్ లీడర్లే సురేశ్​కు షెల్టర్‌‌‌‌ ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్ల ఆధ్వర్యంలో కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ ముందు సరెండర్ అయ్యాడు.

అడ్వకేట్ శరత్ కుమార్ దాఖలు చేసిన సరెండర్ పిటిషన్​ను జడ్జి పరిశీలించారు. సరెండర్​కు అనుమతిస్తూ సురేశ్​ను జ్యుడీషియల్ రిమాండ్​కు అప్పగించారు. డిసెంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. జడ్జి ఆదేశాల మేరకు బొంరాస్​పేట్ పీఎస్ పోలీసులు సురేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్​లో వైద్య పరీక్షలు నిర్వహించి సంగారెడ్డి జైలుకు తరలించారు. 

మరో ఇద్దరు నిందితులు అరెస్ట్

సురేశ్ లొంగిపోగా.. ఈ కేసులో 38వ నిందితుడైన నీరటి సురేశ్, 55వ నిందితుడైన నార్ల హన్మంతును పోలీసులు అరెస్ట్‌‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి కూడా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌‌ విధించారు. పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్‌‌లో ఉండగా.. మిగిలిన నిందితులంతా సంగారెడ్డి జైల్లో ఉన్నారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి ఏ1 కాగా, భోగమోని సురేశ్ రాజ్ ఏ2గా ఉన్నాడు.

రిమాండ్ డైరీలో ఇప్పటి వరకు 70‌‌‌‌ మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో 28 మందిని అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు. నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్‌‌‌‌ రెడ్డి కస్టడీ పిటిషన్​పై బుధవారం విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో నరేందర్‌‌ ‌‌రెడ్డి పోలీసులు కోర్టులో హాజరుపరుచనున్నారు.

దాడి తర్వాత పారిపోయేందుకు పక్కా ప్లాన్

లగచర్లలో కలెక్టర్‌‌‌‌పై దాడి తర్వాత పారిపోయేందుకు సురేశ్ పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం కొందరు కీలక నేతల సహకారం తీసుకున్నట్లు సమాచారం. సురేశ్ కోసం పోలీసులు హైదరాబాద్, చేవెళ్ల, వికారాబాద్​లోని ఫామ్​హౌస్​లతో పాటు ఢిల్లీ, కర్నాటక, గోవా, పుణేలో గాలించారు. ఆరు ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్​లో పాల్గొన్నాయి. అయినప్పటికీ సురేశ్ దొరకలేదు.

అయితే, అనూహ్యంగా మంగళవారం మధ్యాహ్నం కొడంగల్ కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. సురేశ్​కు బీఆర్ఎస్ నేతలు సహకరించినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. విదేశాలకు పారిపోకుండా సురేశ్ పాస్​పోర్టును సీజ్ చేశారు. లుక్ అవుట్ సర్య్యులర్ కూడా జారీ చేశారు