
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి. అధిక ఎండలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు( ఏప్రిల్26-,27) రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
శనివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షంతోపాటు ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాత్రి కొత్తగూడు, ఖమ్మం జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోవైపు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాల్లో గంటలకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక హైదరాబాద్ సిటీ, దాని చుట్టు పక్క న ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటలకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.
మరోవైపు శనివారం( ఏప్రిల్ 26) అధికంగా ఎండలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, వరంగల్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. సాయంత్రం వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో 40నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది.