- ఆహార పదార్ధాల ధరలు పెరగడమే కారణం
న్యూఢిల్లీ: ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో కిందటి నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 5.49 శాతానికి పెరిగింది. అంతకు ముందు నెలలో 3.65 శాతంగా రికార్డయ్యింది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) కిందటేడాది డిసెంబర్‌లో 5.69 శాతంగా నమోదు కాగా, ఆ తర్వాత సెప్టెంబర్‌లోనే ఎక్కువగా రికార్డయ్యింది. అంతేకాకుండా కిందటేడాది సెప్టెంబర్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తక్కువగా నమోదు కావడంతో బేస్ ఎఫెక్ట్ వలన ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తోంది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది ఆగస్టులో 5.66 శాతంగా నమోదైన ఫుడ్ ఇన్‌ఫ్లేషన్, సెప్టెంబర్‌లో 9.2 శాతానికి పెరిగింది. పండ్లు, కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు పప్పులు, గుడ్లు, మాంసం, చేపల రిటైల్ ధరలు ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో కొంత తగ్గాయి.
పెరిగిన హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్..
చాలా ప్రొడక్ట్‌ల హోల్‌సేల్ ధరలు కూడా కిందటి నెలలో పెరిగాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపల ప్రొడక్షన్ కిందటి ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. దీంతో వీటి రేట్లు పెరుగుతున్నాయి. తయారీ ప్రొడక్ట్‌ల రేట్లు, ఇంధన ధరలు తగ్గినా, ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో కిందటి నెలలో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ 1.84 శాతానికి చేరుకుంది. అంతకు ముందు నెలలో 1.31 శాతంగా రికార్డయ్యింది.