![డ్రగ్స్ మాఫియాపై త్వరలో సర్జికల్ స్ట్రైక్](https://static.v6velugu.com/uploads/2025/02/surgical-strikes-in-drug-mafia-planed-by-anti-narkotics-bureau_cDIhGMPyEV.jpg)
- డ్రగ్ కింగ్స్ ఉన్న రాష్ట్రాల్లో దాడులకు రంగం సిద్ధం చేసుకున్న టీజీ న్యాబ్
- పెడ్లర్లు, కస్టమర్లు ఇచ్చిన సమాచారంతో డేటా రెడీ
- ముంబై, గోవా, బెంగళూరులో డ్రగ్స్ కింగ్‌పిన్స్ మూలాలు
- ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా రూపం మార్చుకున్న దందా
హైదరాబాద్, వెలుగు: మత్తు పదార్థాలకు అలవాటైనవారి సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో ప్రస్తుతం డ్రగ్స్, గంజాయి దందా ఆర్గనైజ్డ్ క్రైంగా మారింది. నిషేధిత మత్తు పదార్థాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్), పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పటిష్ట నిఘా పెడుతున్నా.. చాప కింద నీరులా పట్నం నుంచి పల్లెల దాకా దందా విస్తరిస్తూనే ఉంది.
మత్తు మాఫియా ఏటా రాష్ట్రంలో సుమారు రూ.1000 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాల దందా నడిపిస్తోంది. ఈ క్రమంలో గతేడాది రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 1,942 ఎన్‌డీపీఎస్ కేసుల్లో టీజీ న్యాబ్ 4,682 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో రూ.143 కోట్ల విలువచేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా డ్రగ్స్, గంజాయి దందాను కట్టడి చేసేందుకు టీజీ న్యాబ్ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది.
ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్, గంజాయి మూలాలపై దృష్టి పెట్టింది. ఆయా రాష్ట్రాల్లోని మాదకద్రవ్యాల కేంద్రాలపై ఆకస్మిక దాడులకు రంగం సిద్ధం చేసింది. ఆర్గనైజ్డ్ క్రైంగా మారిన ఈ దందాలో ఏజెంట్లు కింగ్ పిన్లుగా, కస్టమర్లు సప్లయర్లుగా మారుతున్నారు. ప్రధానంగా గోవా, ముంబై, బెంగళూరులో డ్రగ్స్ కింగ్ పిన్లు షెల్టర్ తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో పోలీస్ నిఘా పెరగడంతో నైజీరియన్ గ్యాంగ్ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ ఆపరేట్ చేస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లు మినహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కింగ్‌పిన్స్ మాత్రం చిక్కడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త వారితో, సరికొత్త మార్గాల్లో సరుకును మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని మెయిన్ కింగ్ పిన్స్, సప్లయర్లపై టీజీ న్యాబ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్లు, సప్లయర్లు, కస్టమర్లు సహా డీఆర్‌ఐ, నార్కోటిక్స్ బ్యూరో నుంచి సేకరించిన డేటా ఆధారంగా టీజీ న్యాబ్ స్పెషల్ ఆపరేషన్ కు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఆయా రాష్ట్రాల్లో మాదకద్రవ్య ముఠాలపై ‘సర్జికల్ స్ట్రైక్’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది.
కింగ్‌పిన్,సెకండ్ సప్లయర్ లొకేషనన్ల లింకులతో ఆపరేషన్లు
డ్రగ్స్, గంజాయి కేసుల్లో అరెస్టయిన సప్లయర్లు, కస్టమర్లు విచారణలో వెల్లడించిన సమాచారాన్ని టీజీ న్యాబ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. అన్ని కేసుల్లో మాదకద్రవ్యాల మూలాలు, వాటి కింగ్‌పిన్స్, ఏ రాష్ట్రంలో ఉన్నారో లొకేషన్లతో సహా మొబైల్ ఫోన్ నంబర్లు, ద్వితీయ శ్రేణి సప్లయర్ల వివరాలను రాబట్టారు. ఎక్కువ కేసుల్లో బయటపడ్డ వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లోని స్థావరాలపై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
120 నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్లతో సెర్చ్ ఆపరేషన్లు
రాష్ట్రంలోని గంజాయి, డ్రగ్స్ అనుమానిత ప్రాంతాల్లో చెకింగ్ చేసేందుకు బాంబ్ స్క్వాడ్ తరహాలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ కూడా సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 256 జాగిలాలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సేవలు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 120 జాగిలాలు డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను గుర్తించడంలో అత్యత్తమ శిక్షణ పొందాయి.
గంజాయి, డ్రగ్స్ వాడిన తర్వాత చేతికి ఉండే వాసనను ఈ జాగిలాలు గుర్తించి పట్టుకుంటాయి. వీటిని రైళ్లు, బస్టాండ్లతో పాటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద సెర్చ్ ఆపరేషన్లలో వాడుతున్నారు. ఇకపై హైదరాబాద్ శివార్లతో పాటు జిల్లా కేంద్రాల్లోని విద్యా సంస్థల పరిసర ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో ఈ ట్రాకర్లతో తనిఖీలు చేయనున్నారు.
నిఘా కొనసాగిస్తున్నాం
మాదకద్రవ్యాలపై నిఘా కొనసాగుతున్నది. పట్టుబడుతున్న కస్టమర్లలో మార్పు తెచ్చేందు కు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఈ క్రమంలోనే మెయిన్ కింగ్‌పిన్స్ మూలాలు గుర్తిస్తున్నా ము. త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీజీ న్యాబ్ డైరెక్టర్ - సందీప్ శాండిల్యా తెలిపారు.