మోడీ హఠావో.. దేశ్ బచావో.. : జహీరాబాద్ లో రాహుల్

మోడీ హఠావో.. దేశ్ బచావో.. : జహీరాబాద్ లో రాహుల్

తెలంగాణ రాష్ట్ర రిమోట్ ప్రధాని ప్రధాని మోడీ చేతుల్లో ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ . టీఆర్ఎస్, బీజేపీ చెట్టాపట్టాలేసుకుని పనిచేస్తున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రాహుల్.. రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ మాట్లాడారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చారన్నారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ విషయంలో మోడీని కేసీఆర్ సమర్థించారన్నారు. ప్రతి పేద కుటుంబానికి నెలరూ రూ.12వేల ఆదాయం ఉండేలా చూస్తామన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో మోడీ, కేసీఆర్ లను ఓడించడమే లక్ష్యమన్నారు. మోడీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వలేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు.  మోడీ పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారు… తాము పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ.

ప్రధాని మోడీ దేశానికి కాదు… నీరవ్ మోడీ, అనిల్ అంబానీలకు చౌకీదార్ అన్నారు రాహుల్.    మోడీ ఓ 15, 20మంది కోసం మాత్రమే పనిచేస్తారన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కోసం రూ.15వేల కోట్లు ఖర్చవుతాయని… అయితే మోడీ మాత్రం ఈ 15వేల కోట్లను కేవలం 15మంది కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారన్నారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని హామీ ఇచ్చారని.. ఆ ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు రాహుల్.  ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15లక్షలు వేస్తామని మోడీ మోసం చేశారన్నారు. పేదల అకౌంట్లలో ఏడాదికి రూ.72వేలు వేస్తామన్నారు.. అది ఏమైందని రాహుల్ ప్రశ్నించారు. మోడీ దొంగలకు మద్దతిస్తున్నారన్నారు. అబద్దాలు చెప్పడంలో మోడీ ఫస్ట్ అని అన్నారు. దేశానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.