AUS vs IND: బిడ్డ పుట్టాడు.. ఇంకా కుటుంబం ఏంటి?: రోహిత్ మ్యాచ్ ఆడాలంటూ మాజీ క్రికెటర్ డిమాండ్

AUS vs IND: బిడ్డ పుట్టాడు.. ఇంకా కుటుంబం ఏంటి?: రోహిత్ మ్యాచ్ ఆడాలంటూ మాజీ క్రికెటర్ డిమాండ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం.. కోహ్లీ పేలవ ఫామ్ లో ఉండడం.. అనుభవం లేకపోవడం.. షమీ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్ గాయంతో సిరీస్ కు దూరం కావడం లాంటి విషయాలు భారత్ ను కలవరపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కానుండడం భారత్ కు గట్టి దెబ్బ. 

మరో రెండు రోజుల్లో శుక్రవారం (నవంబర్ 22) పెర్త్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. రోహిత్ శర్మ భార్య ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అంతకముందు రోహిత్ వ్యక్తిగత కారణాల వలన బీసీసీఐని సెలవులు కోరాడు. అధికారికంగా ప్రకటించకపోయినా తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది. రోహిత్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. తొలి టెస్టుకు హిట్ మ్యాన్ దూరమైతే భారత్ కు పెద్ద దెబ్బే. కెప్టెన్సీతో పాటు ఓపెనింగ్ సేవలను భారత్ కోల్పోనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రోహిత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ALSO READ : AUS vs IND: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. ప్రాక్టీస్‌లో జైశ్వాల్‌కు గాయం

మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా మాట్లాడుతూ.."మొదట రోహిత్ కు అతని కుటుంబానికి.. మగబిడ్డ జన్మించినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు కుటుంబం పూర్తయింది. రోహిత్ కు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కాబట్టి రోహిత్ వెళ్లి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు గుర్తుంది. నా రిసెప్షన్ జరిగిన రోజు సాయంత్రం నేను మ్యాచ్ కోసం తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నేను నా గదికి చేరుకునే సమయానికి తెల్లవారుజామున 4 గంటలు అయ్యింది.  మ్యాచ్ కోసం నా భార్య నన్ను ఎయిర్ పోర్ట్ కు పంపింది. ఆటగాళ్లకు అలాంటి నిబద్ధతే ఉండాలి". అని ఖన్నా అన్నారు.