పెబ్బేరు, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల్లో వేసిన మిరప పంటకు నీళ్లు వదులుతారా? లేదా? అని సర్పంచులు నిలదీశారు. శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్‌లో మండల సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మీటింగ్ కుహాజరు కాకపోవడంతో సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు రానప్పుడు సమావేశాలు ఎందుకని ఫైర్ అయ్యారు. మిరప పంటను కాపాడేందుకు ఫిబ్రవరి 15 వరకు డీ–19 కాలువకు నీటిని విడుదల చేయాలని కోరారు. జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి ఇరిగేషన్ ఎస్ఈ సత్య శీలారెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను నిరు పేదలకు కాకుండా ప్రభత్వ ఉద్యోగులకు, రెండేసి ఇండ్ల ఉన్న వారికి మంజూరు చేశారని ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని గుమ్మడం సర్పంచ్ సువర్ణ హెచ్చరించారు. ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ పద్మ, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.