19 మంది మావోయిస్టులు లొంగుబాటు

19 మంది మావోయిస్టులు లొంగుబాటు
  • వివరాలు వెల్లడించిన భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్​రాజ్

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రానికి చెందిన19 మంది మావోయిస్టులు గురువారం భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్​రాజ్​ ఎదుట లొంగిపోయారు. భద్రాచలం ఏఎస్పీ ఆఫీస్​లో మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. పోలీసులు, సీఆర్పీఎఫ్​ 81,141 బెటాలియన్లతో కలిసి ఆదివాసీ పల్లెల్లో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. 

తెలంగాణ పోలీసులు ఇస్తున్న భరోసాతో ఛత్తీస్​గఢ్​ అడవుల నుంచి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు వస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన 19 మందిలో ఒకరు డీవీసీఎం, ఇద్దరు ఏసీఎం స్థాయి మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. నరోటి మనీశ్​ అలియాస్​ లోకేశ్​పై రూ.8లక్షలు, ఏసీఎంలు మడివి నంద, మడివి హండాపై చెరో రూ.4 లక్షల రివార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. 

మిగిలిన 16 మంది మావోయిస్టు పార్టీ ప్రజాసంఘాల్లో పని చేస్తున్నారని తెలిపారు. త్వరలో అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రివార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, గత డిసెంబర్ లో లొంగిపోయిన మావోయిస్టులకు రూ.4లక్షల చొప్పున రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ పంకజ్​ పరితోశ్, ఏఎస్పీ విక్రాంత్​కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్​రెడ్డి పాల్గొన్నారు.