లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్‌‌ పార్టీకి చెందిన 64 మంది భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెం పోలీస్‌‌ హెడ్‌‌క్వార్టర్‌‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మల్టీ జోన్‌‌ ఐజీపీ చంద్రశేఖర్‌‌రెడ్డి, ఎస్పీ బి.రోహిత్‌‌రాజ్‌‌తో కలిసి వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారంతా చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం మెంబర్లతో పాటు పలు హోదాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారన్నారు.

 లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున రూ. 16 లక్షలు ఆర్థికసాయం అందజేసినట్లు చెప్పారు. ఏడాదిన్నరలో 122 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోయిస్ట్‌‌ కేంద్ర కమిటీలో 19 మంది ఉండగా, ఇందులో 11 మంది తెలంగాణకు చెందిన వారేనన్నారు. 

మావోయిస్టులు ప్రజల్లో మద్దతు కోల్పోయారని, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. మావోయిస్టులను కట్టడి చేయడంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల కృషి అభినందనీయమని తెలిపారు. మావోయిస్ట్‌‌ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.