ఒకప్పుడు రాచరిక పాలన కొనసాగిన రోజుల్లో రాజులు తమ శత్రువుల అడుగు జాడలు, స్ట్రాటజీలను పసిగట్టడానికి, తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా గూఢచారులను వినియోగించుకునేటోళ్లు. గూఢచారులు సీక్రెట్ గా రాజ్యమంతటా తిరుగుతూ రాజుకు సమాచారం ఇచ్చేటోళ్లు. అవసరమైతే శత్రు దేశాల్లోకి మారువేషంలో వెళ్లి గుట్టుమట్లను తెలుసుకుని వచ్చి రాజుకు ఉప్పందించేవారు. తర్వాత రాజులు పోయి, ప్రజాస్వామ్య దేశాలు వచ్చినయి. అన్ని దేశాల్లోనూ ప్రత్యేకంగా నిఘా విభాగాలు ఏర్పడినయి. కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినయి. దీంతో నిఘా విభాగాల ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను వాడుకుంటూ గూఢచర్యం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లు వచ్చాక ప్రత్యేకంగా నిఘా కోసం కూడా ఎన్నో స్పైవేర్ లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఇలాంటివెన్నో బయటపడ్డాయి కూడా. కానీ ఇప్పుడు వచ్చిన పెగాసస్ స్పైవేర్ పైనే ఎందుకింత దుమారం రేగుతోంది? పెగాసస్ ఒక్కటే ఎందుకింత చర్చకు దారి తీస్తోందన్నది అందరి మనసుల్లోనూ మెదలవుతున్న ప్రశ్న.
దీనిపైనే ఎందుకింత దుమారం?
స్మార్ట్ ఫోన్ లను హ్యాక్ చేసి, నిఘా పెట్టేందుకు గతంలోనూ ఎన్నో స్పైవేర్ లు వచ్చాయి. ఇవన్నీ ఎక్కువగా మెసేజ్ లింక్ రూపంలోనే వచ్చేవి. వీటిని గిఫ్ట్ ఓచర్స్ లేదా బంపర్ లాటరీల రూపంలో హ్యాకర్లు పంపేటోళ్లు. ఆ లింకులను క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్ లలో ఆ స్పైవేర్ లు ఇన్ స్టాల్ అయిపోయేవి. ఆ తర్వాత ఇక మన స్మార్ట్ ఫోన్లు హ్యకర్ల చేతుల్లోకి వెళ్లిపోయేవి. ఇలాంటివి ఇదివరకే చాలా చూసినప్పటికీ, ఇప్పుడు పెగాసస్ ఇంతగా చర్చకు దారితీయడానికి ప్రధానంగా రెండు కారణాలున్నయి. ఇది కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా లేదా వాట్సాప్ మిస్డ్ కాల్ ద్వారా కూడా మన ఫోన్లలోకి చేరిపోతుంది. మనకు ఏమాత్రం తెలియకుండానే ఫోన్లో ప్రతి విషయాన్నీ హ్యాకర్లకు చేరవేస్తుంది. అలాగే పెగాసస్ తో నిఘా పెట్టాలంటే కోట్లాది రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. పవర్ ఫుల్ స్పైవేర్ కావడం, కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండటం వల్లే దీనిపై ఇంత చర్చకు దారితీసిందని చెప్పొచ్చు.
కేంద్రం నిఘా పెట్టిందా?
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్ష పార్టీల అగ్ర నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, సుప్రీంకోర్టు జడ్జీలు, ఇతర ప్రముఖుల మొబైల్ ఫోన్లపై పెగాసస్ స్పైవేర్ తో నిఘా పెట్టిందన్నది ఇప్పుడు అపొజిషన్ పార్టీలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే పెగాసస్ ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్మడం నిజమే అయినా, దీనికి అయ్యే ఖర్చును బట్టి చూస్తే.. విచ్చలవిడిగా ఎవరిపై పడితే వారిపై నిఘా పెట్టడం అంత ఈజీ మాత్రం కాదు. ముఖ్యంగా ప్రతీ సామాన్యుడి మొబైల్ పై దీనితో నిఘా పెట్టొచ్చా? అంటే కచ్చితంగా అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే.. పెగాసస్ తో కనీసం10 ఫోన్ లపై నిఘా పెట్టడానికే సుమారు రూ. 4.8 కోట్లు ఖర్చవుతుంది. ఇక 50 వేల ఫోన్లను హ్యాక్ చేసి ఉంటే ఎన్ఎస్ఓ గ్రూపుకు వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండాలి. కానీ.. గత ఏడాది కాలంలో తమకు వచ్చిన ఆదాయం రూ. 1,700 కోట్లేనని ఎన్ఎస్ఓ ప్రకటించింది. దీనిని బట్టి చూస్తే.. 50 వేల ఫోన్ లపై నిఘా అన్నది ఉత్తి ప్రచారమేనన్నది తేలిపోతోంది. ఇక మన దేశంలోనూ 300 ఫోన్ లపై నిఘా పెట్టాలన్నా సుమారు రూ. 150 కోట్ల దాకా ఖర్చయ్యే చాన్స్ ఉంటుంది. కేంద్రం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి, పెగాసస్ స్పై వేర్ ను వాడుకుంటుందని మాత్రం అనుకోలేం.
అపొజిషన్ నేతలే నిరూపించాలె..
ఓ వ్యక్తి ప్రముఖుడైనా, సామాన్యుడైనా అతని ప్రైవసీని కాపాడటం ప్రభుత్వం బాధ్యత. ప్రైవసీ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పెగాసస్ తో నిఘా విషయాన్ని కేంద్రం స్పష్టంగా ఖండిస్తోంది. అయితే కేంద్రం తమపై నిఘా పెట్టిందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల నేతలు, మీడియా సంస్థలు అయినా తమ ఆరోపణలను నిరూపించుకోవాలి. తమ మొబైల్ ఫోన్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపి, టెస్టులు చేయిస్తే.. పెగాసస్ స్పైవేర్ ఉన్నదీ.. లేనిదీ తేలిపోతుంది. ఆరోపణలు నిజమని చెప్పేందుకు ఇది పక్కా ఎవిడెన్స్ కూడా అవుతుంది. కానీ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఈ దిశగా ఎంతవరకు ప్రయత్నం చేస్తారనేది ప్రశ్నార్థకమే.
ఫోన్ లో ప్రతిదీ హ్యాకర్లకు అందిస్తది
పెగాసస్ స్పైవేర్ మన ఫోన్ లలోకి చొరబడితే.. గ్యాలరీలోని ఫొటోలు, వీడియోలు, మైక్రోఫోన్, కెమెరా, హిడెన్ ఫైల్స్, ఫోన్ కాల్స్ వివరాలు, బ్రౌజింగ్ హిస్టరీ, మెసేజ్ లు, ఈమెయిల్స్, వాట్సాప్ కాల్స్, చాట్లు వంటివన్నీ ఇది గుట్టుచప్పుడు కాకుండా నిఘా పెట్టిన వాళ్లకు చేరవేస్తుంది. ఫోన్ లో మనం ఏయే అక్షరాలు టైప్ చేస్తున్నామన్న సమాచారం కూడా అందజేస్తుంది. ఇంత జరుగుతున్నా ఫోన్ యూజర్లకు దీని విషయంలో ఎలాంటి డౌట్ కూడా వచ్చే అవకాశం ఉండదు. అయితే, స్పైవేర్ లు మన ఫోన్ లోకి చొరబడ్డాయా? లేదా? అని తెలుసుకునేందుకు కొన్ని టిప్స్ మాత్రం ఉన్నాయి. ఫోన్ లో కొత్త యాప్స్ ఏమైనా ఇన్ స్టాల్ అయ్యాయా? బ్యాటరీ ఇంతకుముందు కంటే ఫాస్ట్ గా డౌన్ అవుతోందా? ఫోన్ బాగా స్లో అయిపోయిందా? యాప్ లు వాడేటప్పుడు ఫ్రీజ్ అయిపోతుందా? అన్నవి పరిశీలించాలి. ఇలాంటివేమైనా జరిగితే ఆ ఫోన్ ను వాడకుండా పక్కన పడేయటమే బెటర్ ఆప్షన్ అవుతుంది.
టెర్రరిజం అంతమే పెగాసస్ టార్గెట్
పెగాసస్ స్పైవేర్ ను ఇజ్రాయెల్ కు చెందిన నివీ కార్మి, ఓమ్రి లావియా, షాలేవ్ హులియో అనే ముగ్గురు ఐటీ నిపుణులు రూపొందించారు. పెగాసస్ తయారీ, మార్కెటింగ్ కోసం వీళ్లు 2010లో ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థను ప్రారంభించారు. అయితే అన్ని దేశాలూ ఎదుర్కొంటున్న టెర్రరిజం సమస్యను అంతం చేయాలన్న లక్ష్యంతోనే తాము పెగాసస్ ను తయారు చేశామని, ఈ స్పైవేర్ సేవలను కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతున్నామని ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రకటించింది. తాము ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతాం తప్ప.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఇది వెళ్లే చాన్సే లేదని స్పష్టం చేసింది. కల్యాణ్ దిలీప్ సుంకర, అడ్వకేట్