హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి సూచించారు. 2011 జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఎస్సీలు, ఉప కులాల జనాభా చాలా పెరిగిందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2011 జనాభా లెక్కల్లో 57 ఎస్సీ ఉప కులాల జనాభా రాష్ట్ర జనాభాలో 1.91 శాతం ఉంటే.. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 4.12 శాతంగా ఉందని, రాష్ట్రంలో ప్రస్తుత అంచనా ప్రకారం ఎస్సీ ఉప కులాల జనాభా 30 లక్షలు ఉందని గుర్తుచేశారు.
2011 జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కొంత మంది కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే వర్గీకరణకు అడ్డంకులు ఏర్పడుతాయన్నారు. ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేకంగా ఎంబీఎస్సీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత వర్గాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత వెనుకబడ్డ వర్గాలను గుర్తించి వారికి సామాజిక న్యాయం జరిగే విధంగా ప్రత్యేక కోటాను ఏర్పరిచి అధిక శాతం రిజర్వేషన్ కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించిందన్నారు.