
- 50 శాతం ఇండ్లలో సర్వేనే చేయలే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ముస్లిం బీసీ, హిందూ బీసీ అనిఏ చట్టంలో ఉందని ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన నిర్వహించిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ నివేదికపై బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి లో ఉన్నాయని చెప్పారు. అసలు ముస్లిం బీసీ, హిందూ బీసీ అని ఏ చట్టంలో ఉందో ప్రభుత్వం ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు.
కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు చాలా విచారకరంగా ఉందన్నారు. దాదాపు 50 శాతం ఇండ్లలో సర్వేనే చేయలేదని ఆరోపించారు. దేశ ప్రజలను కులం, మతం పేరుతో విభజించడం కంటే గొప్పది ఏదీ రాహుల్ గాంధీకి లేదన్నారు. ముస్లింలను బీసీల్లో కలపడమే విప్లవాత్మక నిర్ణయమని రాహుల్ అనుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ముస్లిం బీసీలు అనే పదానికి అర్థముందా? అని నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని, ముస్లిం బీసీ, హిందు బీసీ పేర్లతో కులగణన చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.