హెల్త్​ ప్రొఫైల్ ఎన్కవడ్డది

సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఏడాదైనా పూర్తికాని హెల్త్​ సర్వే అందుబాటులోకి రాని  డిజిటల్ హెల్త్ కార్డులు పైలట్  ప్రాజెక్టే ఇట్లా ఉంటే మిగిలిన జిల్లాల్లో ప్రారంభం ఎప్పుడో!

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  ‘రాష్ట్రంల అందరి హెల్త్​ ప్రొఫైల్​ తయారుచేస్తం.. 30 రకాల టెస్టులు చేసి డిజిటల్​కార్డులిస్తం.. ఏ డాక్టర్​ దగ్గరికి పోయినా కార్డు నంబర్​ కొట్టంగనే ఎవ్వల హెల్త్​ కండీషన్​ ఏందన్నది కనవడాలె.. దేశంల ఎక్కడలేదు.. మనదగ్గర్నే మొదలు..’ అంటూ ఏడాది కింద సీఎం చెప్పిన  ముచ్చట ఉత్తదే అయింది.  రాష్ట్రంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణను ‘ఆరోగ్య తెలంగాణ’ గా మార్చేందుకు ‘ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్’ను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన సర్కారు.. ఆచరణలో వెనుకబడింది. 

గతేడాది మార్చి5న పైలట్ ​ప్రాజెక్టుగా ములుగు, రాజన్న సిరిసిల్ల  జిల్లాలను ఎంపిక చేసిన  ప్రభుత్వం.. నెల వ్యవధిలో 17 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్యపరీక్షలు పూర్తిచేసి, హెల్త్​ప్రొఫైల్​రెడీ చేస్తామని, తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించింది.  కానీ ఏడాది గడిచిపోయినప్పటికీ ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికీ సర్వే పూర్తికాలేదు. ఏ ఒక్కరికీ డిజిటల్​కార్డులు అందలేదు. ఇప్పటికి 90శాతం సర్వే పూర్తయిందని, 100 శాతం పూర్తయ్యాక ప్రొఫైల్​ రెడీ చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన తెలంగాణ అంతట హెల్త్​సర్వే పూర్తయ్యేందుకు ఇంకెంత కాలం పడ్తుందోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రెండు జిల్లాలో 398 టీమ్స్ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, ములుగులో మంత్రి హరీశ్​రావు ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 245, ములుగు జిల్లాలో 153 టీమ్​లు పాల్గొన్నాయి. గత ఏడాది మార్చి 5న ప్రారంభించిన సర్వే ఏప్రిల్ నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్కో గ్రామంలో రెండు బృందాలు సర్వే నిర్వహించాయి. ఒక్కో టీంలో ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశా వర్కర్లు, హెల్త్ సూపర్ వైజర్లు,హెల్త్ స్టాఫ్​ నర్సులు ఉన్నారు. ఇలా ప్రతి గ్రామానికి రెండు టీంలు పని చేశాయి. సర్వేలో భాగంగా రోజుకు ఒక్కో గ్రామంలో 40 మందికి టెస్ట్ లు నిర్వహించారు. ప్రతి టీమ్ ఇంటింటికి తిరిగి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తీసుకుని ఆ వివరాలను ఆరోగ్య తెలంగాణ ‘ఈ హెల్త్ ప్రొఫైల్’ యాప్​లో ఎంటర్ చేసి అప్పటికప్పుడు హెల్త్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఎత్తు, బరువు, గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా..బీపీ, షుగర్, టీబీ ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వివరాలను సేకరించారు. రక్త నమూనాలను సేకరించారు. 

హెల్త్ కార్డులు ఇచ్చేదెన్నడో..

హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా రక్త పరీక్షలు చేసేందుకు సిరిసిల్ల జిల్లా  కేంద్రంలో రూ. 30 కోట్లతో టీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాలను  టీ డయాగ్నస్టిక్ హబ్ కు తరలించి టెస్ట్ చేశారు. రెండు జిల్లాల్లో 17 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి 30  రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వచ్చిన ఫలితాలను  కంప్యూటర్ లో నిక్షిప్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం అందరికీ డిజిటల్ కార్డులు మంజూరు చేస్తామని  ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల కోసం హెల్త్ కార్డులు రూపకల్పన వైద్యాధికారులు నిరీక్షిస్తున్నారు. డిజిటల్ కార్డులను ప్రజలకు అందిస్తే  తర్వాత ఏదైనా అనారోగ్యంతో  హాస్పిటల్ లో చేరితే  ఆ రోగికి సంబంధించిన ప్రొఫైల్ చూసి ట్రీట్ మెంట్ అందిస్తారు. కానీ ప్రభుత్వం  డిజిటల్ కార్డులను అందించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. 

90 శాతం సర్వే పూర్తయ్యింది

‘ఈ హెల్త్ ప్రొఫైల్’ సర్వేలో భాగంగా జిల్లాలో 3.47 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. ఇప్పటికే 90 శాతం హెల్త్ సర్వే పూర్తయ్యింది. మిగిలిన పది శాతం మంది జిల్లాలో అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో సర్వే పూర్తి చేయలేకపోయాం. ఇప్పటివరకు చేసిన వైద్య పరీక్షల వివరాలను కంప్యూటర్ లో భద్రపరిచాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. 

- డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా వైద్యాధికారి, రాజన్న సిరిసిల్ల