అభ్యంతరం వస్తే రిజిస్ట్రేషన్​ బంద్.. హద్దుల గొడవలు రాకుండా ఊరూరా సర్వే మ్యాప్​లు

అభ్యంతరం వస్తే రిజిస్ట్రేషన్​ బంద్.. హద్దుల గొడవలు రాకుండా ఊరూరా సర్వే మ్యాప్​లు
  • కొత్త సమస్యలు రాకుండా భూమాత పోర్టల్ రికార్డుల డిజిటలైజేషన్
  • కొత్త రెవెన్యూ చట్టంలో ప్రధాన అంశాలివే.. 
  • నెలాఖరులోగా అసెంబ్లీ సమావేశాలు పెట్టకపోతే ఆర్డినెన్స్ తేవాలని సర్కారు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కొత్త ఆర్ఓఆర్​–2024 చట్టాన్ని నెలఖారులోగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆర్​ఓఆర్​ ముసాయిదాపై అభిప్రాయ సేకరణ పూర్తవగా.. కొన్ని మార్పులు, చేర్పులు చేయిస్తున్నది. నెలఖారులోగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లయితే.. సభలో బిల్లు పెట్టి చర్చ అనంతరం చట్టంగా తీసుకురానున్నారు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరగనట్లయితే, కేబినేట్​ సమావేశంలో ఆమోదం తెలిపి.. ఆర్డినెన్స్​ తేనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సెక్రటేరియెట్​ వర్గాలు వెల్లడించాయి. కొత్త ఆర్​ఓఆర్​ చట్టంలో 3 అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటి వరకు ధరణిలో తలెత్తిన సమస్యలేవీ కొత్త చట్టం తర్వాత రాకుండా భూమాత పోర్టల్​ను తేవాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​ సమయంలో ఏమైనా అభ్యంతరాలు వస్తే.. దానిని హోల్డ్​లో పెట్టి, ఎంక్వైరీ అనంతరం పూర్తి చేసేలా మార్పులు చేస్తున్నారు. తహసీల్దార్​ లెవెల్​లో భూ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే ఆర్డీవో, కలెక్టర్​ లెవెల్​లో రెవెన్యూ కోర్టు అప్పిలేట్స్​ ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపనున్నారు. 

ఇతరులు పట్టా మార్చకుండా లాక్ సిస్టమ్.. 

ప్రధానంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌‌‌‌ టైంలో సర్వే మ్యాప్‌‌‌‌ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌‌‌‌కు వెళ్లే వారు ఈ మ్యాప్‌‌‌‌ను ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వివాదాలు రాకుండా.. గతంలో లేని ఈ కొత్త నిబంధనను తెస్తున్నారు. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్న తర్వాత ) మాత్రమే ఈ మ్యాప్‌‌‌‌ తప్పనిసరి అవుతుందని చెప్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఆన్​లైన్​లో ప్రతి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్లవారీగా మ్యాప్​ను సిద్ధం చేసి పెట్టనున్నారు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్​, మ్యుటేషన్​కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక పహానీలకు ఏటా మాన్యువల్​గా ఆన్​లైన్​లో పెట్టనున్నారు. 2016 నుంచి పహానీలు రాయడం లేదు. భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులను గుర్తించి, ఈ 18 పద్ధతుల్లో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా రికార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రైట్స్‌‌‌‌(ఆర్‌‌‌‌వోఆర్‌‌‌‌)లో నమోదు చేయనున్నారు. ప్రతి రికార్డు డిజిటైలైజ్ చేయనున్నారు. అసైన్డ్​ భూముల దగ్గర నుంచి శిఖం జాగలదాకా అన్నింటికీ దేనికదే ఆన్​లైన్​లో, ఆఫ్​లైన్​లో రికార్డుల నిర్వహణ చేపట్టనున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ భూములను ఇతరులు పట్టా భూములుగా మార్చకుండా లాక్​ సిస్టంను వినియోగించనున్నారు.