ఎవరు పడితే వాళ్లతో ఆస్తుల సర్వే

పంప్​ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, స్టూడెంట్లు..

ఎలాంటి  ప్రిపరేషన్​ లేదు.. అంతా ఆగమాగం

కనీసం టేపులు కూడా ఇస్తలేరు.. అడుగులతోనే మెజర్​మెంట్స్

అప్​లోడ్​లోనూ సమస్యలు.. సర్కార్​ తీరుపై జనం ఆగ్రహం

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా చేపడుతున్న ఆస్తుల సర్వే గందరగోళంగా సాగుతున్నది. సర్కారు ఇచ్చిన గడువు తక్కువగా ఉండడం, మున్సిపాలిటీలు, ఊళ్లలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఎవరు దొరికితే వాళ్లతో సర్వే చేయిస్తున్నారు. ఆఖరికి నల్లానీళ్లు రిలీజ్​ చేసే పంప్​ ఆపరేటర్లను, కరెంట్​పోల్స్​కు లైట్లు బిగించే లైన్​మన్లనూ, స్టూడెంట్లను, యువకులనూ వాడుకుంటున్నారు. కొన్నిచోట్ల మెప్మా రిసోర్స్​పర్సన్స్, సమైక్య సంఘాల మహిళలు, అంగన్​వాడీ టీచర్లు, వార్డుమెంబర్లతోపాటు ప్రైవేట్​ సిబ్బందితోనూ సర్వే చేయిస్తున్నారు. ఎవరికీ సరైన ట్రైనింగ్​ లేకపోవడంతో ఆస్తుల మెజర్​మెంట్​ తీసుకోవడంలో, ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేయడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  అక్టోబర్​10లోగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ నమోదు చేసి దసరా కల్లా ధరణి పోర్టల్​లో అందుబాటులోకి తేవాలన్న సర్కారు ఆదేశాలతో పట్టణాలు, ఊళ్లలో మున్సిపల్​, పంచాయతీ ఆఫీసర్లు సోమవారం నుంచి ఆగమేఘాల మీద సర్వే ప్రారంభించారు.

తొలిరోజు ఫారాలతో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించిన సిబ్బంది.. బుధవారం నుంచి డైరెక్ట్​గా ఆన్​లైన్​లో నమోదుచేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వే ఫారాల్లో నింపి తర్వాత తీరిగ్గా ఆన్​లైన్​లో ఎంటర్​ చేస్తున్నారు. ఇందుకోసం ధరణి పోర్టల్​లో ‘టీఎస్​ఎన్​పీబీ’ పేరిట ప్రత్యేక యాప్​ను అందుబాటులోకి తెచ్చారు. సర్వేకు వెళ్లే సిబ్బంది మొబైల్​లో ఈ యాప్ డౌన్​లోడ్​ చేసుకున్నాక యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ ద్వారా లాగిన్ అయి​ ఆస్తులు, పర్సనల్​ డిటైల్స్​ ఎంటర్​ చేస్తున్నారు. 50 వరకు కాలమ్స్ ఉండడం, సర్వర్​ ప్రాబ్లమ్స్​, సిగ్నల్స్​ రాకపోవడం లాంటి సమస్యలతో వివరాల నమోదుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇష్టమొచ్చినట్లుగా మెజర్​మెంట్స్​

గతంలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు తహసీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్​ఏలు, ఇతర రెవెన్యూ స్టాఫ్​ నెలల తరబడి కసరత్తు చేశాక జారీచేసిన కొత్త పట్టాదారుపాస్​బుక్​లలో సవాలక్ష తప్పులు వచ్చాయి. వాటిని కరెక్షన్​ చేసేందుకు  మరికొన్ని నెలలు పట్టింది. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు పాస్​బుక్​లలో కరెక్షన్ల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తీరా ఇప్పుడు ఇండ్లు, ఖాళీ జాగల మెజర్​మెంట్స్​ఎట్లా తీయాలనే కనీస నాలెడ్జ్​ లేని సిబ్బందితో సర్వే చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ఇంటికి వెళ్లి సుమారు 47 అంశాలపై ప్రశ్నించి, జవాబులు రాబట్టి ఎంటర్​చేసేందుకు గంటలు గంటలు పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరోజు 50 ఇండ్లలో సర్వే చేయాలని చెబుతున్నా.. ప్రాక్టికల్​గా సాధ్యం కావడం లేదని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో తమ పేర్లు, వివరాలు, మెజర్​మెంట్స్​తప్పుగా నమోదైతే తమకు భవిష్యత్​లో ఇబ్బందులు వస్తాయని పబ్లిక్​ ఆవేదన చెందుతున్నారు. కొన్నిచోట్ల ఇదే విషయమై సర్వేకు వచ్చిన స్టాఫ్​ను నిలదీస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో సర్వేకు వెళ్తున్న సిబ్బందికి ఆఫీసర్లు కనీసం టేపులు కూడా ఇవ్వడంలేదు. సూర్యాపేట మున్సిపాలిటీ లో వార్డుకు ఇద్దరు చొప్పున బయట వ్యక్తులతో సర్వే చేయిస్తూ  రూ. 80 చొప్పున చెల్లిస్తున్నారు. వీరికి కనీసం టేపు కూడా ఇవ్వకపోవడంతో అడుగుల లెక్క కొలుస్తున్నారు. కరీంనగర్​ సిటీలో మొత్తం 72 వేల ఇండ్లు ఉండగా, 15 రోజుల్లో సర్వే పూర్తికావాలని సీనియర్​ ఆఫీసర్లు టార్గెట్​ పెట్టారు. దీంతో రోజూ 4,800 ఇండ్లను సర్వే చేయాల్సి వస్తున్నదని, కానీ సరిపడా సిబ్బంది లేక టార్గెట్​ రీచ్​కావడం కష్టంగా మారిందని అక్కడి ఓ ఆఫీసర్​ చెప్పారు. అందువల్లే  మున్సిపల్ ఉద్యోగులతో పాటు​కార్మికులను, మెప్మాసిబ్బందిని, ఇతర ప్రైవేట్​ వ్యక్తులనూ సర్వే కోసం పంపకతప్పడంలేదని పేర్కొన్నారు.

స్టాఫ్​కు వింత అనుభవాలు

ఆస్తుల సర్వేకు వెళ్తున్న స్టాఫ్​కు చాలాచోట్ల వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి లో ఓ ఇంటి యజమాని ఇటీవలే చనిపోయాడు. వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, తల్లి ఆ ఇంటి ఓనర్​కాలమ్​లో పెద్ద బిడ్డ పేరు రాయించింది. దీంతో మిగిలిన ఇద్దరు.. సర్వే స్టాఫ్​ ముందే అబ్జెక్షన్​ చేశారు. అక్క పేరిట పాస్​బుక్​వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీంతో స్టాఫ్.. తల్లి పేరు రాసుకొని వెళ్లిపోయారు. మరో చోట అన్నదమ్ముల మధ్య ఇలాంటి చిక్కే వచ్చింది. వాళ్ల తండ్రి కొద్దినెలల కింద చనిపోగా, ఇంకా ఆస్తి పంపకాలు జరగలేదు.  వచ్చిన సిబ్బంది ‘అన్న’ పేరు రాయగా..  తమ్ముడు తప్పుబట్టాడు. జాయింట్​ ప్రాపర్టీ అనే కాలమ్  దగ్గర తమ్ముడి పేరు ఎంటర్​చేస్తామన్నా ఒప్పుకోలేదు. తన అన్న పేరుపై పాస్​బుక్​ వచ్చాక తన పరిస్థితి ఏమిటని నిలదీశాడు. వాళ్ల తల్లి కూడా గతంలోనే చనిపోవడంతో ఏంచేయాలో అర్థం కాక సర్వే సిబ్బంది.. పైఆఫీసర్లను అడిగి చెబుతామంటూ వెనుదిరిగారు. వేములవాడలోని గాంధీనగర్​లో ఓ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉండగా.. ఆ ఇల్లు వాళ్ల తాతపేరుతో ఉంది. ముగ్గురూ ఆ ఇల్లు తమదంటే తమదని చెప్పడంతో సర్వే సిబ్బంది వివరాలు ఎంటర్​చేయకుండానే వెనుదిరిగారు. ఇదే పట్టణంలోని ఓ ఇంటికి వెళ్లినప్పుడు ఆ యజమాని, తన ఆస్తుల కింద ఇల్లు ఎంటర్​ చేస్తున్నారని, కానీ దాని వెనుక ఉన్న అప్పుల సంగతి ఏమిటని అడిగాడు. అప్పులు కూడా ఎంటర్​ చేసేలా కాలమ్​ పెట్టాలనడంతో సర్వే సిబ్బంది తెల్లమొహం వేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఐడీఎస్ఎంటీ కాలనీవాసులకు వింత సమస్య ఎదురైంది.1990లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సొంత ఇండ్లులేని వారికి సులభ వాయిదాల పద్ధతిలో 1,224 ప్లాట్లను అమ్మారు. కానీ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని 2009లో కొందరు హైకోర్టుకు వెళ్లడంతో ఇప్పటివరకు ప్రాపర్టీ హక్కులు రాలేదు. తాజాగా జరుగుతున్న సర్వేలో ఆయా ఇండ్లను అందులో ఉంటున్నవాళ్ల పేరిట ఎంటర్​చేస్తే లీగల్​గా చిక్కులు వస్తాయేమోనని స్టాఫ్​ అనుమానిస్తున్నారు. ఇలాంటి లీగల్ ప్రాబ్లమ్​ ఉన్న ఆస్తుల నమోదు విషయంలో సీనియర్​ ఆఫీసర్ల నుంచి ఇంకా క్లారిటీ రాలేదని వారు చెబుతున్నారు.

డాక్యుమెంట్స్​ కోసం పట్టు..

సర్వేకు వెళ్లిన సిబ్బంది.. ఆస్తుల డాక్యుమెంట్స్ అడుగుతుండడంతో పబ్లిక్​ఇబ్బందిపడుతున్నారు. తరతరాలుగా ఆయా ఇండ్లలో ఉంటున్నా ఎలాంటి డాక్యుమెంట్స్​ లేకపోవడంతో ఏంచేయాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. హౌస్​  ఓనర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటే కిరాయివాళ్లకు తిప్పలు తప్పడం లేదు. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట లో బుధవారం 60 ఇండ్లను సర్వే చేశారు. సర్వే సందర్భంగా 12 ఇండ్లకు సంబంధించి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు. ఇల్లు, ఇంటి పక్కన ఖాళీ స్థలానికి సంబంధించిన పత్రాలు కచ్చితంగా కావాలన్న సిబ్బంది.. లేవనడంతో వివరాలు ఎంటర్​ చేయకుండానే వెళ్లిపోయారు.

For More News..

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయలేం

ఎలక్షన్ల గురించి నేనట్లా అనలే..

కేసీఆర్ తమ దగ్గర పుట్టనందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు బాధపడుతున్నరు