ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే షురూ 

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే షురూ 

ఖమ్మం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్ర స్థాయిలో డేటా సేకరణ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. ఆయా గ్రామాలు, పట్టణాల వారీగా సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. రెండు వారాల్లోగా కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వారు అందుబాటులో లేని చోట ఐకేపీ సీసీలు పనిచేస్తున్నారు.

ఈ డేటా సేకరణ సిబ్బందికి ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. వారి మొబైల్ ఫోన్లలో ఇందిరమ్మ ఇండ్ల యాప్​ ను ఇన్​స్టాల్ చేశారు. ఆ యాప్​ల్లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన విషయాలు నమోదు చేస్తున్నారు. అప్పుడే లబ్ధిదారుల ఫొటోలను కూడా తీసుకుంటున్నారు. 

6.36 లక్షల అప్లికేషన్లు.. 

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తీసుకున్న ఈ దరఖాస్తుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 6.36 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 3,57,869, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,76,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ అప్పట్లోనే ఆన్​ లైన్​ చేశారు.

ఈ డేటాను యాప్​ లో నిక్షిప్తం చేసి సిబ్బందికి అందజేశారు. ఆ డేటా ప్రకారం దరఖాస్తుదారుల దగ్గరకు వెళ్లిన సిబ్బంది, వారి నుంచి వివరాలను సేకరిస్తారు. గతంలో ఇచ్చిన డేటాలో ఏవైనా తప్పులు ఉంటే ఇప్పుడు యాప్​ ద్వారా సరిచేసే అవకాశాన్ని కల్పించారు. ఆధార్, ఫోన్​నెంబర్, రేషన్​ కార్డు నెంబర్లలో తప్పులుంటే సరిచేయొచ్చు. 

Also Read :- బ్యాంక్ మేనేజర్​ను పొట్టుపొట్టు కొట్టిండు

10 నియోజవర్గాలకు 35వేల ఇండ్లు 

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇస్తామని ప్రకటించడంతో, ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కలిపి 35 వేల ఇండ్లు రానున్నాయి. దీని కింద లబ్ధిదారులకు బేస్​ మెంట్, శ్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్ ద్వారా నాలుగు విడతల్లో రూ.5 లక్షలు మంజూరు కానున్నాయి. ఈ నాలుగు దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫొటోను యాప్​ లో అప్​ లోడ్​ చేస్తేనే, పేమెంట్ మంజూరు చేస్తారని అధికారులు చెబుతున్నారు. 

యాప్​లో నమోదు చేస్తున్న వివరాలు.. 

దరఖాస్తుదారులు సొంత ఇంట్లో ఉంటున్నారా? కిరాయి ఇంట్లో ఉంటున్నారా? లాంటి 30 కాలమ్స్​ ను యాప్​ లో నమోదు చేస్తున్నారు. ఖాళీ జాగా ఉంటే దాన్ని ఫొటో తీసి అప్​లోడ్ చేస్తున్నారు. మొదటి విడతలో ఖాళీ జాగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తుండడంతో, యాప్​లో తప్పనిసరిగా ఖాళీ జాగా ఫొటోను తీసుకుంటున్నారు. లబ్ధిదారులు కిరాయి ఇండ్లలో ఉంటే ఆ వివరాలను కూడా యాప్​ లో ఎంట్రీ చేస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దరఖాస్తుదారులు నివాసం ఉంటున్నట్లయితే ఆ ఇల్లు పూరిల్లు, రేకుల ఇల్లు, పెంకుటిల్లు అనేది కూడా నమోదు చేస్తున్నారు.

ఇంటి లోపలి భాగం, పై భాగం ఫొటోలను తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలం ఉన్న వారి నుంచి ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ ను ఫొటో తీసుకుంటున్నారు. గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిపొందారా అనే వివరాలను ఆరా తీస్తున్నారు. దరఖాస్తుదారుల్లో ఒంటరి మహిళ, దివ్యాంగులు, వితంతు మహిళ ఉంటే వారి సమాచారాన్ని కూడా నమోదు చేస్తున్నారు.