- వచ్చే నెల మొదటి వారంలో కంప్లీట్ చేస్తామన్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల సర్వే శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 51లక్షల అప్లికేషన్లు 65% సర్వే పూర్తయిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. శనివారం ఒక్క రోజే 4.31 లక్షల సర్వే పూర్తయిందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మొబైల్ యాప్ , టెక్నికల్ ఇబ్బందులు వస్తే వెంటనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉన్న టెక్నికల్ అధికారులు పరిష్కరిస్తున్నారని చెప్పారు.
టెక్నికల్ సమస్యలతో యాప్ పనిచేయడం లేదని వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి సర్వేలో పాల్గొని యాప్ పనితీరును పరిశీలించానని వెల్లడించారు. కార్పొరేషన్ సీఈ, ఈఈ, సీనియర్ కన్సల్టెంట్లు కూడా ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించి యాప్ పనితీరును జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారని చెప్పారు.