ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల్లో  హైరానా

  • రిపోర్టుల ఆధారంగా ప్లాన్లలో మార్పు
  • బలం తగ్గుతుందన్న చోట కీలక నేతల ఎంట్రీ
  • నియోజకవర్గంలోనే అగ్ర నేతల మకాం

నల్గొండ, వెలుగు: మునుగోడు ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నా కొద్ది ప్రధాన రాజకీయ పార్టీల్లో సర్వేల టెన్షన్ పట్టుకుంది. ఎప్పటికప్పుడు వస్తున్న రిపోర్టులను అంచనా వేస్తున్న ఆయా పార్టీల అగ్రనేతలు వాటికి తగ్గట్టు వ్యూహాలు మారుస్తూ ప్రచారం చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సభలు, ప్రచారాలు, నేతల చేరికలతో ఏ మండలంలో ఏ పార్టీకి ఎంత బలం పెరిగింది? ప్రజల్లో ఏ పార్టీ నాయకుడి గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది? గతంలో ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయానికి, ఇప్పటికీ ఏమైనా తేడా వచ్చిందా? అనే కోణంలో వివిధ రకాల సర్వే ఏజెన్సీలు ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. దసరా తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏడు శాతం గ్యాప్ ఉందని ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​ ఇవ్వగా, తాజాగా బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడం, బండి సంజయ్, వివేక్ ​వెంకటస్వామి, రఘునందన్​రావు, కిషన్ రెడ్డి లాంటి నాయకుల ప్రచారంతో పలు మండలాల్లో బీజేపీ బలం పెరిగినట్లు టీఆర్ఎస్ సర్వే రిపోర్టుల్లో తేలినట్టు సమాచారం. బీజేపీకి చౌటుప్పల్, చండూరు లాంటి పట్టణాల్లో బలం పెరిగిందని, యువకులు ఆ పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నారని అధికార పార్టీ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో శుక్రవారం పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ రంగంలోకి దిగారు. గతంలో నాంపల్లి, మర్రిగూడ రోడ్​షోల్లో హరీశ్​రావు పాల్గొనడంతో పార్టీకి మైలేజ్ వచ్చిందని నివేదికలు చెప్పడంతో కేటీఆర్ కూడా చౌటుప్పల్​లో రోడ్ షో పెట్టారని ఆ పార్టీ సీనియర్ లీడర్​ ఒకరు చెప్పారు. దీనికి పత్రివ్యూహంగా ఆదివారం చండూర్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, చౌటుప్పల్​లో రాజగోపాల్ ​ప్రచారం చేయనున్నారు. ఇక కాంగ్రెస్ సర్వే రిపోర్ట్ ప్రకారం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న సభలకు జనం నుంచి విశేష స్పందన వస్తోంది. సంస్థాన్ నారాయణపూర్ ​మండలంలో రేవంత్ ఎఫెక్ట్​ కనిపిస్తున్నా, ఈ స్పీడ్ మిగిలిన మండలాల్లో కనిపించడం లేదని సర్వే రిపోర్టులు చెబుతున్నట్టు తెలుస్తోంది. చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పార్టీ బలంగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా ఫీల్డ్ లెవెల్​లో ప్రచారం ఆశించిన స్థాయిలో జరగడం లేదని పార్టీ సీనియర్ నేత చెప్పారు. దీంతో ఎన్నికల నాటికి పార్టీలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఈ నెల 26,27 తేదీల్లో నియోజకవర్గ సమస్యలపై దీక్ష చేయాలని నిర్ణయించగా, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ తెలిపారు. 

ఇక బహిరంగ సభల వంతు

దీపావళి తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోతాయని ప్రధాన రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 31వ తేదీకే ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి నాలుగు రోజులు ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలకు ప్లాన్​ చేసినట్టు తెలిసింది. ఈ నెల 30 లేదా 31 సీఎం కేసీఆర్ చండూరులో సభ ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ కూడా తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మునుగోడులో భారీ బహిరంగ సభకు ప్లాన్ ​చేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా మునుగోడులోనే ఈ నెలాఖరున భారీ సభ పెడతామని, దీనికి జాతీయ స్థాయి నాయకులు వస్తారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు.

అగ్రనేతల వ్యూహాలు..ప్రతివ్యూహాలు

ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న ఆయా పార్టీల అగ్ర నేతలు వాటికి తగ్గట్టు తమ ప్రచార సరళిని మారుస్తున్నారు. దీని కోసం నియోజకవర్గంలోనే మకాం వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చౌటుప్పల్​ మండలం లక్కారం సమీపంలోని ఫాంహౌస్​లో ఉంటూ ప్లాన్లు రూపొందిస్తున్నారు. బూత్ ఇన్​చార్జిలు, ఎన్నికల ఇన్​చార్జిలతో రివ్యూ మీటింగులు పెడుతూ ప్రచారం గురించి ఆరా తీస్తున్నారు. మునుగోడు మండలం కొంపల్లిలోని తన సమీప బంధువు గెస్ట్​హౌస్​లో ఉంటున్న రేవంత్ రెడ్డి మండలాల వారీగా సర్వే రిపోర్టులు తెప్పించుకుని సమీక్షలు జరుపుతున్నారు. రాహుల్​గాంధీ యాత్ర ఉండడంతో గ్యాప్ ​తీసుకుని మక్తల్​ వెళ్లారు. ఇక టీఆర్ఎస్ ఎన్నికల ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్​రెడ్డి కొద్దిరోజులుగా మంత్రి కేటీఆర్​తోనే ఉంటున్నారు. నియోజకవర్గం అవతల కులాల వారీగా మీటింగులు పెడుతున్న కేటీఆర్ శుక్రవారం చౌటుప్పల్​ ​రోడ్​షోలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ నాయకులు శుక్రవారం రంగంలోకి దిగారు. ఇప్పటికే సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో గ్రామాల వారీగా పార్టీ ప్రచార సరళి గురించి సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. శనివారం చండూరులో బీజేపీ తలపెట్టిన ముదిరాజ్ సభకు అతిథిగా యూపీ మంత్రి సంజయ్ నిశాంత్ పాల్గొన్నారు.