ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసినా.. ఎంత మంది పట్టుబడుతున్నా.. లంచావతారులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ సర్వేయర్. దమ్మపేట మండలం గాంధీనగరంలో ఓ వ్యక్తి నుండి మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
ఖమ్మంలో నివాసముండే మద్దినేని వెంకట్ కు దమ్మపేట మండలంలో పొలాలు ఉన్నాయి. తన చెల్లెలుకు సంబంధించిన పొలం పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోగా, సర్వే పూర్తి చేసిన సర్వేయర్ వెంకటరత్నం రిపోర్ట్ తన దగ్గరే ఉంచుకొని లక్షా యాభై వేలు డిమాండ్ చేశాడు. అంతమొత్తం తమవద్ద లేదని, రూ.50 వేలకు ఒప్పందం చేసుకుని బాధితుడు మద్దినేని వెంకట్ ACB ని ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ACB డీఎస్పీ వై. రమేష్ టీం మండలంలోని గాంధీ నగరంలో మాటువేసి సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచగొండి సర్వేయర్ ను అరెస్టు చేసి వరంగల్ కోర్టుకు తరలించారు.
Also Read :- అమెరికన్ రిపబ్లిక్ కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వీడియో
తన రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ నెంబర్లు తేడాలు ఉన్నాయంటూ.. తన మ్యాపులో లేదంటూ నెల రోజులుగా తిప్పుతూ డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు పేర్కొన్నారు. రెవెన్యూ పై కనీసం నాలెడ్జి లేని వ్యక్తి ఆరేళ్లుగా సర్వేయర్ గా ఇక్కడ పనిచేస్తున్నాడని, ఎవరు ఏ పని కోసం వచ్చినా సకాలంలో పనులు చేయకుండా విసిగించేవాడని ఫిర్యాదుదారుడు తెలిపాడు. డబ్బులు డిమాండ్ చేస్తూ రైతుల కష్టాన్ని కొల్లగొడుతుండటంతో విసిగిపోయి ఏసీబీ నాశ్రయించానని వెంకట్ తెలిపాడు.