జైళ్లలో ఉంటున్న ఖైదీలతో కొన్ని పనులు చేయిస్తారు. అలా చేసిన వారికి కొంత డబ్బులను చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాల్లోని జైళ్లశాఖ అధికారులు వంద రూపాయలకు పైగా ఇస్తుంటే మన రాష్ట్రంలోని కారగారాల్లో పని చేస్తున్న ఖైదీలకు మాత్రం రూ. 30 నుంచి50 ఇస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ఇలా వీరు చెల్లించే డబ్బులకి బయట అల్పాహారం చేయడానికే సరిపోతుంది. జైళ్లలోని పరిసరాలను శుభ్రం చేయడం, ఇతర పనులకు 50 నుంచి 70రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలుస్తున్నది. ఇవే పనులు చేసే ఖైదీలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రూ. 300 ఇస్తున్నారు. ఢిల్లీలో రూ.194 , కర్ణాటకలో రూ.175, తమిళనాడు రాష్ట్రంలో రూ.160 చెల్లిస్తున్నారు.
కేవలం మన రాష్ట్రంలోనే చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఖైదీలకు కూడా ఉంటుంది అనే విషయాన్ని జైళ్లశాఖ అధికారులు మరిచిపోతున్నారు. ఖైదీలు తయారు చేసిన వస్తువుల నుంచి పొందే ఆదాయంలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. కానీ ఇలా అధిక ఆదాయాలు తెస్తున్న ఖైదీల పనులకు మాత్రం సరైన వేతనం ఇవ్వడం లేదు. ఈ విషయంలో తెలంగాణ ఖైదీల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వారు పేర్కొన్న నిబంధనల ప్రకారం ఖైదీలు చేసే పనులకి సరైన వేతనాన్ని ఇవ్వాలని, ఇతర రాష్ట్రాలలోని జైళ్ళల్లో పనులు చేస్తున్న వారికి చెల్లించే విధంగా తెలంగాణలో కూడా ఖైదీలు చేసే పనులకి అంతే మొత్తంలో చెల్లించాలనే నియమం మాత్రం మన దగ్గర అమలు కావడం లేదు. కాగ్ సూచనలు కనుమరుగై పోయాయి. కాబట్టి కాగ్ సూచించిన నియమాలు విస్మరించకుండా జైళ్లశాఖ అధికారులు పాటించాలి.
- కూరపాటి శ్రావణ్ కొండాపూర్, జనగామ జిల్లా