- రైతు భరోసా కోసం సాగు యోగ్యం కాని భూముల వివరాల సేకరణ
- ప్రత్యేక యాప్‌లో భూముల వివరాలు నమోదు
- కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలుచేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు స్కీమ్ లకు సంబంధించి గురువారం నుంచి ఫీల్డ్‌సర్వే నిర్వహించనున్నారు. ఈ నెల 20 వరకు సర్వే చేపట్టి లబ్ధిదారుల ముసాయిదా జాబితా రెడీ చేయనున్నారు. తర్వాత 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి జాబితాలు ఫైనల్ చేస్తారు.
లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ఎప్పటికప్పుడు 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీ పూర్తిచేస్తారు. ఫీల్డ్‌సర్వే, గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులపై కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ లిస్టును అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో, ఫ్లెక్సీల్లో ప్రచురిస్తారు. గ్రామసభలకు ఆర్ఐ, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శిని ఒక టీమ్ గా.. వార్డు సభలకు వార్డు అధికారి, డిప్యూటీ తహసీల్దార్, ఏఈ ఒక టీమ్ గా, 4, 5 గ్రామాలకు కలిపి క్లస్టర్ వారీగా ఎంపీడీఓ, తహసీల్దార్, సూపరింటెండెంట్ ను కలిపి కోఆర్డినేషన్ టీమ్‌గా నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఢిల్లీ నుంచి కలెక్టర్లతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు.
సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు
సాగు భూములకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని ఇప్పటికే సర్కారు ప్రకటించింది. దీంతో సాగులో లేని భూములను గుర్తించేందుకు గురువారం నుంచి ఫీల్డ్ సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఇరిగేషన్, ఇండస్ట్రీల అవసరాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను, నాలా కన్వర్షన్అయిన భూములను, వెంచర్లకు సంబంధించిన రికార్డులు రెవెన్యూ, అగ్రికల్చర్శాఖలకు చేరాయి. వాటి ఆధారంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిర్ధారించనున్నారు.
ఇందుకోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఏఈలు, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు, వివిధ శాఖల సూపరింటెండెంట్ల ఆధ్వర్యంలో మండలాలవారీగా స్పెషల్టీమ్లు ఏర్పాటుచేశారు. వీటిలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏఈవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ ఏపీవోలు, సాంకేతిక సహాయకులు, ఇతర సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం తొలుత ఇచ్చిన ఆదేశాల ప్రకారం తహసీల్దార్లు, వ్యవసాయాధికారుల నేతృత్వంలో వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కూడిన కమిటీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, గ్రామసభలు నిర్వహించాలి.
కానీ లక్షల ఎకరాల్లో భూములు ఉండటం, రికార్డుల తనిఖీలు, క్షేత్రస్థాయి పరిశీలన ఈ నలుగురితో సాధ్యం కాదని ఇతర శాఖల సిబ్బందిని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ భారతి నుంచి దాదాపు కోటి 52 లక్షల ఎకరాల డేటాను జిల్లాలవారీగా పంపారు. అందులో సాగుకు యోగ్యం కాదో ఆ భూములను ప్రత్యేక యాప్ లో బ్లాక్ లిస్ట్ లో మార్కింగ్ ఎంట్రీ చేస్తారు. ఏయే భూములకు రైతు భరోసా ఇస్తారో ఫ్లెక్సీ ల్లో, గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆధార్‌తో లింక్
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ. 6,000 చొప్పున రెండు విడతలుగా రూ. 12,000 నగదు సాయం అందిస్తారు. ఈ పథకానికి ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పని దినాలు పూర్తి చేసినవారి జాబితా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు చేరింది. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపాధి హామీ కూలీల గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు సమన్వయంతో గ్రామ సభల్లో ఈ జాబితాను ప్రచురించాలి. గ్రామ సభల్లో అభ్యంతరాలు వస్తే, వాటిని స్వీకరించి, పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రేషన్ కార్డులకు ఇలా..
కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని పేద కుటుంబాల జాబితాను రెడీ చేసిన ప్రభుత్వం అన్ని జిల్లాలకు వాటిని పంపించింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో అడిషనల్కలెక్టర్ (రెవెన్యూ), డీసీఎస్ఓకు పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. మండల స్థాయిలో ఎంపీడీవో, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్చేయనున్నారు.
లిస్టు ఆధారంగా దరఖాస్తుదారుల కుటుంబ వివరాలను సేకరించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. భూములు, ఆదాయం తదితర వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గుర్తించి, ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్‌లో కుటుంబాల సమగ్ర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించనున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ఒక లిస్ట్ రెడీ అయింది. దీనిని కూడా మరోసారి పరిశీలించి తొలి ప్రాధాన్యతలో ఇచ్చే ఇండ్ల లబ్ధిదారులను గ్రామ సభల్లో ఫైనల్ చేస్తామని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’కు చెప్పారు.