ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ టీ20 బ్యాటర్ ఎవరంటే సూర్య కుమార్ యాదవ్ అని ఠక్కున చెప్పేస్తాం. ఇక బెస్ట్ బౌలర్ ఎవరంటే వెంటనే బుమ్రా గుర్తుకొస్తాడు. సూర్య మెరుపులు, బుమ్రా స్వింగ్ చూసే అవకాశం క్రికెట్ ఫ్యాన్స్ కు వచ్చినా.. వీరిద్దరి మధ్య ఫైట్ చూసే అవకాశం అభిమానులకు ఉండదు. ఎందుకంటే వీరిద్దరూ టీమిండియా తరపున ఆడడంతో పాటు.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నారు. అయితే సూర్య కుమార్ యాదవ్ కనీసం నెట్స్ లో కూడా బుమ్రా బౌలింగ్ లో ప్రాక్టీస్ చేయడట.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం (ఏప్రిల్ 11) ముంబై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం 19 బంతుల్లో ఐదు బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. గాయంతో నాలుగు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న సూర్య.. ఢిల్లీ క్యాపిటల్స్ తో రీ ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మరోవైపు బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు.
ఇద్దరూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినా బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో సూర్యా మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ పై ప్రశంసలు కురిపించాడు. "నెట్స్ లో నేను బుమ్రా బౌలింగ్ ఆడక మూడేళ్లయింది. ఎందుకంటే అతని బౌలింగ్ లో ఆడితే నా కాళ్ళు విరుగుతాయి. లేకపోతే నా బ్యాట్ విరిగిపోతుంది" అని అన్నాడు. నెట్స్ లో కూడా బుమ్రా బౌలింగ్ లో ప్రాక్టీస్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వచ్చే ఏడాది మెగా ఆక్షన్ లో వీరిద్దరూ వేలంలోకి వస్తే.. ఈ సమరాన్ని చూడొచ్చు.