హైదరాబాద్, వెలుగు: అంకితభావంతో దేశ సరిహద్దుల్లో వాయుసేన అందిస్తున్న సేవలు అభినందనీయమని కెప్టెన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎలాంటి సవాళ్లను అయినా ధీటుగా ఎదుర్కోవడంలో వారు పోషిస్తున్న పాత్ర.. భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‌బండ్ వద్ద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం నిర్వహించిన ఎయిర్‌షో అద్భుతంగా ఉందన్నారు.
కుందన్‌బాగ్ లోని తన నివాసంలో కెప్టెన్ సూర్య కిరణ్ ఆధ్వర్యంలోని టీమ్ తో మంత్రి ఉత్తమ్ ఆదివారం సమావేశం అయ్యారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో యుద్ధ విమాన పైలెట్‌గా పని చేసిన రోజులను సూర్య కిరణ్ టీమ్‌తో ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో మిగ్ 21, మిగ్ 23 వంటి అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలను నడుపుతూ దేశభద్రతలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం వాయుసేనకు గర్వకారణంగా నిలుస్తున్నదని కొనియాడారు.
ప్రపంచ వ్యాప్తంగా వైమానిక విన్యాసాలు ప్రదర్శించడంలో ఎంతో ప్రసిద్ధి అని తెలిపారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌ను చూసి ఈ తరం యువత స్ఫూర్తి పొందాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. యుద్ధ విమానాలు నడపడంలో కెప్టెన్, మంత్రి ఉత్తమ్ కుమార్ సిద్ధహస్తుడు అని సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ కెప్టెన్ అజయ్ సారథి తెలిపారు. ధైర్యం, ఎంతో నిష్టతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలు అందించారన్నారు. వాయుసేనలో ఆయన ఓ ఐకాన్‌గా నిలిచిపోతారని కొనియాడారు. 2019 నుంచి 2023 వరకు పార్లమెంట్లో రక్షణ శాఖ కోసం వేసిన పార్లమెంటరీ కమిటీలో ఉత్తమ్ రక్షణ శాఖ సిబ్బంది సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు.