సూర్య నమస్కారం.. ప్రతి ఒక్కరిలో ఉత్తేజం

మకర సంక్రాంతి.. సూర్యుడు కొద్దిగా ఉత్తరాన ఉదయించే రోజు. ఎన్నో మార్పులకు సంకేతం సంక్రాంతి. ఈ పండుగ దేశ ప్రజలకు అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యవసాయ సందేశాలను అందిస్తుంది. ఈ అనంత విశ్వంలో అంతర్గత, బాహ్య మార్పులు, రాశి చక్ర గమనం సంక్రాంతితో ప్రారంభమవుతాయి. విశ్వం ప్రాధాన్యతను గుర్తు చేసే సంక్రాంతి.. మానవ శరీరం, మనస్సు బాహ్య ప్రపంచంతో చేయి కలిపి ముందుకు సాగాలని మనకు గుర్తు చేస్తుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ‘సూర్య నమస్కారాల’ ద్వారా ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. యోగాసనాలు వేసి సూర్య భగవానుడికి అంజలి ఘటించాలన్నది ఈ కార్యక్రమం  ముఖ్య ఉద్దేశం. 

మానవాళికి అనేక సంవత్సరాల నుంచి భారతీయ యోగా అందుబాటులో ఉంది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో యోగాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గతంలో ఏ భారతీయ కార్యక్రమానికి లభించని ఆదరణ, గుర్తింపు తొలిసారిగా యోగాకి లభించాయి. 2014లో యునైటెడ్​ నేషన్స్​సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోడీ అంతర్జాతీయ స్థాయిలో యోగాని ఆదరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు స్పందించిన యూఎన్‌‌‌‌ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగాలో అతి ముఖ్యమైన ప్రక్రియల్లో సూర్యనమస్కారాలు ఒకటి. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ నాయకత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు.. యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న వివిధ సంస్థల సహకారంతో సూర్య నమస్కారాలపై భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సూర్య నమస్కారాలతో యోగాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు, ఆదరణ లభిస్తాయి.
సూర్య నమస్కారాల వల్ల ఎన్నో లాభాలు..
ఇటీవల కాలంలో కరోనా వైరస్​ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎన్నో లక్షల కుటుంబాల్లో కల్లోలం రేపింది. ఇప్పుడు మరోసారి కరోనా థర్డ్​వేవ్, ఒమిక్రాన్​ వేరియంట్​ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తమ మనస్సు-–-శరీరం–-ఆలోచనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మందికి సూర్య నమస్కారాల గురించి తెలుసు. అయితే, వీటిని ప్రతి రోజూ ఆచరిస్తున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. సూర్య నమస్కారం అనేది సూర్యభగవానుడికి నమస్కారం చేయడం మాత్రమే కాకుండా అనేక విశిష్టతలను కలిగి ఉంది. మానవుని శరీరం, మనస్సు, ధార్మిక అంశాలు సూర్య నమస్కారం వల్ల ప్రభావితం అవుతాయి. క్రమపద్ధతిలో తరచు సూర్య నమస్కారం ఆచరించినప్పుడు మనకు, మన శరీరానికి శక్తి వస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత సమాజంలో ఇవి మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. సూర్యుడు సమస్త జీవరాశులకు, జీవశక్తికి మూలం. ప్రతి వ్యక్తి సూర్యుని నుంచి శక్తి పొందుతారు. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా సూర్య నమస్కారాలు ఆచరించడం ద్వారా మనం శక్తిని పొందవచ్చు.
కరోనా నుంచి సులువుగా బయటపడొచ్చు..
రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ సూర్య నమస్కారాలతో కరోనా వైరస్​ ముప్పు నుంచి సులువుగా బయటపడొచ్చని యోగా చెబుతోంది. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు రోగ నిరోధక శక్తిని, మానసిక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఉందని ప్రపంచం గుర్తించింది. ఈ నేపథ్యంలో సూర్య నమస్కారాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ యోగా సంస్థలను భాగస్వాములను చేసి వారి సహకారంతో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒకసారి నిర్వహించి ఆపేయడం కాకుండా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. జనవరి 14న జరిగే ప్రదర్శన శాశ్వత ప్రాతిపదికన కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇదే అంశాన్ని ఇటీవల హైదరాబాద్‌‌‌‌లో 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ప్రకటించిన సమయంలో వివరించాం.
శరీరం లోపల అద్భుతాలు
సూర్య నమస్కారాలు చేసేటప్పుడు సూర్య కిరణాల ఫోకస్‌‌‌‌  డైరెక్టుగా మన శరీరంపై పడేవిధంగా చూసుకోవాలి. శరీరం మొత్తాన్ని టోన్ చేసే పవర్ వీటికి ఉంది. కేవలం పది నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసుకు 
ప్రశాంతత కలుగుతుంది. ప్రతి విషయంలోనూ పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వీటిని చేస్తే బరువు తగ్గడం మాత్రమే కాదు కొన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలు లభిస్తాయి. ఆత్మ ప్రశాంతతకు, శరీర ప్రశాంతతకు కూడా సూర్య నమస్కారం బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరంలో వాతం, పిత్తం, ఖఫం నియంత్రణకు తోడ్పడుతుంది. చర్మ సౌందర్యం పెరగడం, వెంట్రుకలు బలపడటం, అధిక బరువును కోల్పోవడం ఇవన్నీ సూర్య నమస్కారాలు మనకిచ్చే పైపై లాభాలు మాత్రమే. వీటివల్ల శరీరం లోపల జరిగే అద్భుతాలు మరెన్నో. సూర్య నమస్కారాల వల్ల కడుపులోని పేగులు సక్రమంగా పని చేయటం మొదలుపెడతాయి. జీర్ణ వ్యవస్థ బాగుపడి అజీర్తి సమస్యలు, మలబద్ధకం వంటివి ఉండవు. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్ర ధ్యానంతో కలిసి చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. వీటిని బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలను వస్తాయి.
ఎనిమిది ఆసనాలు.. 12 దశలు
సూర్య నమస్కారం అనేది ఎనిమిది ఆసనాలతో 12 దశల్లో సాగుతుంది. ఎటువంటి శిక్షణ లేకుండా అన్ని వయస్సుల వారు చేసేందుకు వీలుగా ఉండటం ఈ ఆసనాల ప్రత్యేకత. ఈ 12 దశలను తరచు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలను సులువుగా ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తి మన శరీరానికి, మనసుకు లభిస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా వివరించడం కష్టం. అయితే, ప్రతిరోజూ సూర్య ఆసనం వేయడం వల్ల నాకు కలిగిన ప్రయోజనాలు వివరిస్తాను. ఆసనాలతో మన శరీరం శక్తిని పొందుతుంది. ఈ ప్రభావం రోజంతా కనిపిస్తుంది. దీని వల్ల ఆరోగ్య అంశాలపై వ్యక్తిగతంగానే కాకుండా జాతీయ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుంది. సూర్యుడు, సూర్య నమస్కారం వంటి సహజ వనరుల ద్వారా లభించే శక్తితో ఈ మకర సంక్రాంతి నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని విశ్వసిస్తున్నాం. సహజ వనరులు మనకు అత్యంత విశ్వసనీయ వనరులుగా భవిష్యత్​లోనూ అందుబాటులో ఉంటాయి. ఈ నవ సంకల్పం మానవాళికి అనేక విధాలుగా ప్రయోజనం కల్పిస్తుందన్న నమ్మకం ఉంది.  -సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి