- వ్యవసాయంలో తీసుకుంటున్న చర్యలపై ఆరా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఉత్తరప్రదేశ్అగ్రికల్చర్ మినిస్టర్ సూర్యప్రతాప్ షాహి, సహాయమంత్రి బల్దేవ్ సింగ్ భేటీ అయ్యారు. బుధవారం ఐటీసీ కోహినూర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్న మంత్రులు ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రైతులకు రాష్ట్ర బడ్జెట్ లో సింహాభాగం కేటాయించామని, అలాగే రైతు రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు.
రైతుల నికర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తుమ్మల చెప్పారు. ప్రైవేట్, పబ్లిక్ రంగంలో విత్తనోత్పత్తి సంస్థలను భారీగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ మంత్రి మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో 9 వ్యవసాయ జోన్లు ఉన్నాయని, చెరకు పంటలో యాంత్రికరణ తీసుకురావడం, చక్కెర కర్మాగారాలను భారీ ఎత్తున ఆధునీకరించడం ద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచామని తెలిపారు. నీటి నిర్వహణ, విద్యుత్ వినియోగానికి ఖర్చు ఎక్కువ కావడంతో పంటమార్పిడి దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. వరి విత్తనాలు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రం నుంచే వస్తాయన్నారు. తమ పర్యటనలో భాగంగా విత్తన కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సమావేశంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, యుపీ సీఎం సలహాదారు అవనీశ్ కే అవస్తి, యూపీ అగ్రికల్చర్ సెక్రటరీ రవీందర్ పాల్గొన్నారు.