- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్స్‌లో లైవ్
ముంబై : ఇప్పటికే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఆఖరిదైన ఐదో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 4–1తో సిరీస్‌ను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్య కుమార్, ఓపెన్ సంజూ శాంసన్‌పై ఫోకస్ ఉండనుంది. నాలుగు మ్యాచ్‌ల్లో శాంసన్ కేవలం 35 రన్స్‌తో సరిపెట్టుకోగా, సూర్య 0, 0, 12, 0 రన్స్ మాత్రమే చేశాడు. కనీసం ఆఖరి పోరులో అయినా ఈ ఇద్దరూ ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. వాంఖడే సొంత గ్రౌండ్ కావడంతో సూర్య కచ్చితంగా రాణిస్తాడని అంచనాలు వేస్తున్నారు.
అభిషేక్ శర్మ, రింకూ సింగ్, తిలక్ వర్మ కూడా భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టారు. మిడిలార్డర్‌లో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. బౌలింగ్‌లో ఇండియాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. అర్ష్‌దీప్, హార్దిక్ వికెట్లు తీయకపోయినా.. స్పిన్నర్లు మాత్రం టాప్ పెర్ఫామెన్స్ చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ సూపర్ టర్నింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపెడుతున్నారు.
పుణెలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి దుమ్మురేపిన హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే చాన్సుంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తోంది. ఇది జరగాలంటే ఇంగ్లిష్ టీమ్ బ్యాటర్లు మరోసారి మెరవాల్సి ఉంటుంది. బ్రూక్ ఫామ్‌లోకి రాగా. టాప్‌లో సాల్ట్, డకెట్, బట్లర్ చెలరేగాలి. ఆర్చర్, కార్సీ రన్స్ కట్టడి చేయడంలో ఫెయిలవుతున్నారు. దీనిపై దృష్టి పెడితే ఇండియాను అడ్డుకోవడం కష్టం కాకపోవచ్చు.