- పాండ్యా కాదు సూర్య!
- ఇండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి సూర్యకుమార్ యాదవ్
- కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఓటు అతనికే
న్యూఢిల్లీ: వరల్డ్ కప్ అనంతరం షార్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. వరల్డ్ కప్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించి, ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకే ఈ ఫార్మాట్ పగ్గాలు అప్పగించడం ఖాయం అనుకుంటున్న సమయంలో కొత్తగా మరో పేరు వచ్చింది.
షార్ట్ ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా పోటీలోకి వచ్చాడు. 2026 టీ20 వరల్డ్ కప్ వరకూ సూర్యను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ, సెలెక్టర్లు భావిస్తున్నారు. పాండ్యా విషయంలో బోర్డు, సెలెక్షన్ కమిటీ మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. అతని ఫిట్‌నెస్ సమస్యలే ఇందుకు కారణం. ఎనిమిదేండ్ల కెరీర్‌లో పాండ్యా చాలాసార్లు గాయాలకు గురయ్యాడు. ఈ కారణంగానే టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో సూర్యకు టీ20 కెప్టెన్సీ అప్పగించడం మంచి ఆప్షన్ అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై గంభీర్, అగార్కర్ మంగళవారం సాయంత్రం పాండ్యాతో మాట్లాడి, కెప్టెన్సీ విషయంలో తమ ప్లాన్ మార్పు, లాంగ్ టర్మ్ ఆప్షన్‌గా సూర్యను పరిగణిస్తున్న విషయాన్ని అతనికి వివరించినట్టు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో టాప్ బ్యాటర్ కావడంతో పాటు గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికా టూర్‌లో టీ20 సిరీస్‌ల్లో కెప్టెన్‌గా మెప్పించడం సూర్యకు ప్లస్ పాయింట్ కానుంది.
అతని కెప్టెన్సీ స్టయిల్ గురించి ప్లేయర్ల నుంచి బీసీసీఐ ఫీడ్‌బ్యాక్ కూడా తెప్పించుకుందని సమాచారం. 33 ఏండ్ల సూర్య విషయంలో ప్లేయర్లంతా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో అతనికి మంచి అనుబంధం ఉంది. గతంలో గంభీర్ కెప్టెన్సీలో ఐపీఎల్‌లో తను కేకేఆర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ టైమ్‌లోనే టీ20 ప్లేయర్‌గా వెలుగులోకి వచ్చిన సూర్యకు గౌతీనే ‘స్కై’ అనే పేరు పెట్టాడు.
లంకతో సిరీస్ నుంచే పగ్గాలు!
శ్రీలంకతో ఈ నెల 27 నుంచి జరిగే టీ20 సిరీస్‌తోనే సూర్యకుమార్ ఈ ఫార్మాట్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో ఈ టూర్‌కు ఇండియా టీ20, వన్డే జట్లను సెలెక్టర్లు ప్రకటించనున్నారు. కాగా, ఈ టూర్‌లో పాండ్యా టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి విరామం కోరినట్టు తెలుస్తోంది.