ముంబై: వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ పట్టికలో అట్టడుగు స్థానానికి వెళ్లిపోయిన ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఓటమి ఖాయం అనుకున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ ( 51 బాల్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 నాటౌట్) సూపర్ సెంచరీ కొట్టడంతో ప్లే ఆఫ్స్ దిశగా ముందుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బకొట్టింది. వాంఖడేలో సోమవారం జరిగిన ఈ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గెలిచి ఉప్పల్‌లో తమను ఓడించిన రైజర్స్‌పై రివెంజ్ తీర్చుకుంది.
తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 173/8 స్కోరు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (30 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 48), కెప్టెన్ పాట్ కమిన్స్ (17 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్) ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో ముంబై 17.2 ఓవర్లలోనే 174/3 స్కోరు చేసి గెలిచింది. సూర్య, తిలక్ వర్మ (37 నాటౌట్) నాలుగో వికెట్‌కు 79 బాల్స్‌లోనే 143 రన్స్ జోడించారు. సూర్యకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
రాణించిన హెడ్, కమిన్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత హెడ్, చివర్లో కమిన్స్ మెరుపులతో 170 ప్లస్ స్కోరు సాధించింది. మిడిల్ ఓవర్లలో రైజర్స్‌ను దెబ్బకొట్టిన ముంబై బౌలర్లు ప్రత్యర్థిని అడ్డుకున్నారు. స్టార్టింగ్‌లో ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ (16 బాల్స్‌లో 11) తొలి వికెట్‌కు 56 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. రెండో ఓవర్లో సిక్స్ కొట్టిన తర్వాత అభిషేక్ తడబడినా హెడ్ మాత్రం మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు. అరంగేట్రం కుర్రాడు అన్షుల్ కంబోజ్ వేసిన ఐదో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. ఫస్ట్ స్పెల్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బుమ్రా ఆరో ఓవర్లో లెంగ్త్ బాల్‌తో అభిషేక్‌ను ఔట్ చేసి ముంబైకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు.
కంబోజ్ వేసిన ఎనిమిదో ఓవర్లో హెడ్ క్యాచ్‌ను తుషార డ్రాప్ చేశాడు. కానీ, మయాంక్ అగర్వాల్ (5)ను బౌల్డ్ చేసిన కంబోజ్ ఐపీఎల్‌లో వికెట్ల ఖాతా తెరిచాడు. హార్దిక్ బౌలింగ్‌లో నితీశ్ కుమార్ (20) రెండు ఫోర్లు కొట్టగా సగం ఓవర్లకు రైజర్స్ 88/2 స్కోరుతో మెరుగ్గానే కనిపించింది. అయితే11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన చావ్లా తన మూడో బాల్‌కే హెడ్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే హార్దిక్ షార్ట్ బాల్‌ను వెంటాడిన నితీశ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. 13వ ఓవర్లో హిట్టర్ క్లాసెన్ (2)ను క్లీన్ బౌల్డ్ చేసిన చావ్లా రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. వరుసగా ఐదు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో 14 ఓవర్లకు రైజర్స్ 107/5తో నిలిచింది.
చావ్లా బౌలింగ్‌లోనే 6,4తో మార్కో జాన్సెన్ (17) ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, 16వ ఓవరలో అతనితో పాటు షాబాజ్ అహ్మద్ (10)ను పెవిలియన్ చేర్చిన పాండ్యా ముంబై టీమ్‌లో జోష్ నింపాడు. 16 ఓవర్లకు 125/7తో నిలిచింది. తర్వాతి ఓవర్లో అబ్దుల్ సమద్ (3)ను చావ్లా ఎల్బీ చేయడంతో రైజర్స్ 150 స్కోరు చేస్తే గొప్పే అనిపించింది. కానీ, చివరి ఓవర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ సన్వీర్ సింగ్(8 నాటౌట్)తో కలిసి కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చావ్లా బౌలింగ్‌లో సిక్స్, బుమ్రా ఓవర్లో ఫోర్ రాబట్టిన అతను తుషార వేసిన ఆఖరి ఓవర్లో 6, 4 సహా 17 రన్స్ రాబట్టి స్కోరు 170 దాటించాడు.
టాప్ ఢమాల్.. సూర్య కమాల్
ఛేజింగ్‌లో టాపార్డర్ చేతులెత్తేసినా సూర్యకుమార్ సెన్సేషనల్ బ్యాటింగ్‌తో ముంబై గెలిచింది. మొదట వెంటవెంటనే రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన ఇషాన్ కిషన్ (9)ను రెండో ఓవర్లోనే మార్కో జాన్సెన్ పెవిలియన్ చేర్చాడు. ఆపై నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్ తన రెండో బాల్‌కే క్లాసెన్ క్యాచ్‌తో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(4) ను ఔట్ చేయడంతో స్టేడియం మొత్తం సైలెంట్ అయింది. ఆ ఓవర్‌ను కమిన్స్ మెయిడిన్ చేయగా.. భువనేశ్వర్ బౌలింగ్‌లో నమన్ ధీర్ (0) డకౌట్ అవ్వడంతో ముంబై 31/3తో డీలా పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ భారీ షాట్లతో హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో సూర్య సిక్స్ రాబట్టగా.. తిలక్ రెండు ఫోర్లు కొట్టాడు. ఆపై జాన్సెన్ బౌలింగ్‌లో సూర్య 4, 4, 6, 6తో టాప్ గేర్‌లోకి వచ్చేశాడు. మరో ఎండ్‌లో తిలక్ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో 12వ ఓవర్లో స్కోరు వంద దాటింది. మధ్యలో కాసేపు నెమ్మదించిన సూర్య 30 బాల్స్‌లో ఫిప్టీ పూర్తి చేసుకున్న తర్వాత మరింత స్పీడు పెంచాడు. జాన్సెన్ వేసిన 13వ ఓవర్లో వరుస ఫోర్లు కొట్టిన అతను భువీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్స్, స్పిన్నర్ షాబాజ్ ఓవర్లో మరో రెండు బౌండ్రీలతో మ్యాచ్‌ను తమ వైపు లాగేసుకున్నాడు. కమిన్స్ వేసిన 17వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో రెచ్చిపోయిన సూర్య.. తర్వాతి ఓవర్లో నట్టూ వేసిన లో ఫుల్ టాస్‌ను లాంగాఫ్ మీదుగా తన మార్కు సిక్స్ కొట్టాడు. దాంతో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 173/8 (హెడ్ 48, కమిన్స్ 35*, పాండ్యా 3/31, చావ్లా 3/33)
ముంబై: 17.2 ఓవర్లో 174/3 (సూర్య 102*, తిలక్ 37*, భువనేశ్వర్ 1/22)