![ఫామ్‌లోకి సూర్యకుమార్..హర్యానాతో రంజీ క్వార్టర్స్‌లో ముంబై జోరు](https://static.v6velugu.com/uploads/2025/02/suryakumar-yadav-played-a-key-innings-in-the-ranji-trophy-quarter-final-match-against-haryana_ciq4ngZwRX.jpg)
కోల్‌కతా : ఇండియా టీ20 టీమ్ కెప్టెన్, ముంబై స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (70) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హర్యానాతో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అతనితో పాటు కెప్టెన్ అజింక్యా రహానె (88 బ్యాటింగ్), బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ (6/58) కూడా ఆకట్టుకోవడంతో మ్యాచ్‌లో ముంబై పట్టుబిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 263/5తో మూడో రోజు, సోమవారం ఆట కొనసాగించిన హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 వద్ద ఆలౌటైంది.
మిగిలిన ఐదు వికెట్లను శార్దూల్ పడగొట్టడంతో ముంబైకి తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆ జట్టు 278/4 స్కోరుతో మూడో రోజు ఆట ముగించింది. ప్రస్తుతం రహానెకు తోడు శివం దూబే (30 బ్యాటింగ్) క్రీజులో ఉండగా ముంబై మొత్తంగా 292 ఆధిక్యంలో కొనసాగుతోంది.
గుజరాత్‌కు భారీ ఆధిక్యం
ఉర్విల్ పటేల్ (140), జైమీత్ పటేల్ (103) సెంచరీలతో విజృంభించడంతో సౌరాష్ట్రతో క్వార్టర్‌ఫైనల్లో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 511 రన్స్ చేసింది. ఫలితంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 295 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. మూడో రోజు ఆట చివరకు సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 33/0 స్కోరుతో నిలిచింది. తమిళనాడుతో మ్యాచ్‌లో విదర్భ పట్టు బిగించింది. పేసర్ ఆదిత్య థాకరే (5/34) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 225 రన్స్‌కే ఆలౌటైంది.
128 రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన విదర్భ 169/5తో మూడో రోజు ఆట ముగించింది. ఓవరాల్‌గా 297 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో క్వార్టర్ ఫైనల్లో కేరళపై జమ్మూ కాశ్మీర్ పైచేయి కొనసాగుతోంది. కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 281 వద్ద ఆలౌటవగా.. రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూ 180/3తో మూడో రోజు ఆట ముగించింది.