IND vs SL 2024: సూర్య, రింకూ సూపర్ బౌలింగ్.. గంగూలీ కెప్టెన్సీని గుర్తు చేస్తున్న గంభీర్

IND vs SL 2024: సూర్య, రింకూ సూపర్ బౌలింగ్.. గంగూలీ కెప్టెన్సీని గుర్తు చేస్తున్న గంభీర్

శ్రీలంతో జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్ లో సంచలన విజయం సాధించింది. ఓడిపోయే మ్యాచ్ లో మ్యాచ్ ను టై చేసుకొని సూపర్ ఓవర్ లో నెగ్గింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చేసిన అనూహ్య బౌలింగ్ మార్పులు టీమిండియాకు కలిసి వచ్చాయి. లంక విజయానికి చివరి రెండు ఓవర్లలో 9 పరుగులు కావల్సిన దశలో అద్భుతం జరిగింది. సిరాజ్ బౌలింగ్ కు వస్తాడనుకుంటే ఆశ్చర్యకరంగా రింకూ సింగ్ 19వ ఓవర్‌లో బౌలింగ్ వేయడం విశేషం 

ఈ ఓవర్ లో రింకూ కేవలం 3 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే చివరి ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ వేసాడు. 6 పరుగులను చేయాల్సిన దశలో కేవలం 5 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.  దాంతో, మ్యాచ్ టై అయ్యి.. సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్ లో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఖలీల్ అహ్మద్, సిరాజ్ లకు చెరో ఓవర్ మిగిలి ఉన్నప్పటికీ.. ఎప్పుడూ బౌలింగ్ వేయని సూర్య చివరి ఓవర్ వేయడం.. మ్యాచ్ ను కాపాడడం అంతా ఒక వింతలా అనిపించింది.

ఈ మ్యాచ్ లో భారత్ నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగింది. సిరాజ్, ఖలీల్ అహ్మద్, బిష్ణోయ్, సుందర్ భారత్ తుది జట్టులో ఉన్నారు. గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత్ నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగేది. ఐదో బౌలర్ కొత్త పూర్తి చేయడానికి గంగూలీ, సచిన్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ ఉండేవారు. సరిగ్గా నిన్నటి మ్యాచ్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ ప్రణాళికలో కోచ్ గంభీర్ పాత్ర ఉందనే సంగతి స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రాక్టీస్ సెషన్ లో సూర్య చేత బౌలింగ్ చేయించాడు. భారత్ ఇలాగే కొనసాగితే బ్యాటింగ్ డెప్త్ పెరగడంతో పాటు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. 138 పరుగుల స్వల్ప ఛేదనలో శ్రీలంక సరిగ్గా 137 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో లంక మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేయగా.. సూర్య తొలి బంతికే ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు. వాషింగ్ టన్ సుందర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సూర్య కుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.