Suryakumar Yadav: ఆటగాడిగానే కొనసాగుతా.. కెప్టెన్సీ అతనికే ఇవ్వండి: సూర్య కుమార్ యాదవ్

బుచ్చిబాబు ఆల్ ఇండియా ఇన్విటేషనల్ టోర్నమెంట్‌ ఆగస్టు 15న చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత టీ20 కెప్టెన్  సూర్యకుమార్ యాదవ్  ముంబై తరఫున ఆడనున్నాడు. అయితే కెప్టెన్ గా ఉండడానికి మాత్రం తాను ఆసక్తి చూపించలేదట. అతడికి కెప్టెన్సీ పదవి ఇస్తానని చెప్పినా.. సూర్య మాత్రం సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చీఫ్ సంజయ్ పాటిల్‌కు సర్ఫరాజ్ ఖాన్ కు కెప్టెన్సీ ఇవ్వాలని సూర్య కోరాడట.  

ఆగస్ట్ 27 నుండి సేలం వేదికగా సూర్య.. జమ్మూ కాశ్మీర్ తో జరిగే మ్యాచ్ లో ఆడతాడని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఈ టోర్నీ ముందు సూర్య మాటాడుతూ ఇలా అన్నాడు. “నేను బుచ్చి బాబు టోర్నమెంట్ ఆడతాను. దేశవాళీ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఇది నాకు మంచి ప్రాక్టీస్ సెషన్. ఆగస్ట్ 25 తర్వాత జట్టులో చేరతాను. ఖాళీగా ఉన్నప్పుడు ముంబై, క్లబ్ జట్టు కోసం ఆడేందుకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను” అని ఈ మిస్టర్ 360 చెప్పుకొచ్చాడు. సూర్య కుమార్ ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 

ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆగస్టు 4న రంజీ ట్రోఫీకి సన్నాహకంగా ప్రారంభం కానున్న టోర్నమెంట్ కోసం ముంబై జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైకి 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించిన కెప్టెన్ అజింక్య రహానే ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఈ వెటరన్ ప్లేయర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌ వన్డే కప్ లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. షామ్స్ ములానీ,అంగ్క్రిష్ రఘువంశీ ఈ టోర్నీకి అందుబాటులో ఉండడం లేదు. ముంబయికి సర్ఫరాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.