
న్యూఢిల్లీ : ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఎంట్రీ మరికొన్ని రోజులు ఆలస్యం కానుంది. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకుంటున్న సూర్య ఇంకా ఫుల్ ఫిట్‌నెస్ సాధించలేదు. ‘సూర్య ఫిట్‌నెస్‌లో పురోగతి కనిపిస్తున్నా అది మ్యాచ్ ఆడేందుకు సరిపోదు.
కాబట్టి మరికొన్ని మ్యాచ్‌లకు అతను దూరంగా ఉండాల్సిందే. వీలైనంత త్వరగా సూర్యను ముంబై టీమ్‌లోకి తెచ్చేందుకు ఎన్‌సీఏ ట్రెయినర్లు శ్రమిస్తున్నారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో సూర్య ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన బీసీసీఐ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని భావిస్తోంది.