రాజస్థాన్‌లో సూర్యనగరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబైలోని బాంద్రా నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. పాలిలోని రాజ్‌కియావాస్ సమీపంలో తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో పట్టాలు తప్పడంతో ఎనిమిది బోగీలు పక్కకు పడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని..క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో 11 కోచ్‌లు ప్రమాదానికి గురయ్యాయని నార్త్ వెస్ట్రన్ రైల్వే సీపీఆర్‌వో వెల్లడించారు. ప్రమాదం కారణంగా ఇతర ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు. రైలు మార్గంలోనూ మరమ్మతులు చేస్తున్నామని..ఆ మార్గంలో వెళ్లాల్సిన 12 రైళ్లను దారి మళ్లించామన్నారు. మరో రెండు రైళ్లను రద్దు చేశామని చెప్పారు.