కేసీఆర్​ పర్యటనలు ఎవరి కోసం?

తెలంగాణలో ఎక్కడి సమస్యలు అక్కడ్నే ఉండగా.. సీఎం కేసీఆర్​మాత్రం దేశ పర్యటనకు బయలుదేరారు. ఇక మిగిలింది దేశ అభివృద్ధే అని, గత పాలకులు ఆశించిన ప్రగతి సాధించలేదని, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల ఆర్థిక వృద్ధి రేటు కన్నా మనం హీనంగా ఉన్నామని ఆయన పదే పదే చెబుతున్నారు. ప్రాంతీయ కుటుంబ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న విషయాన్ని గమనించి, తన తప్పులను కేంద్ర ప్రభుత్వం మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదని, రాష్ట్రాన్ని అప్పులు చేసుకోనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. పైగా కేంద్రం ఫెడరల్ స్ఫూర్తి పాటించడంలేదని ఆక్షేపిస్తున్నారు. 

మోడీ పర్యటన
రాష్ట్రపతి, ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వస్తే వ్యక్తిగత ఎజెండాతో, కుంటిసాకులతో ఆ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం. మే 26న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే.. సీఎం కేసీఆర్  ప్రధాని అధికారిక  కార్యక్రమంలో పాల్గొన లేదు. అత్యవసరంగా అదే రోజు పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవగౌడను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది దేనికి సంకేతం? మన రాష్ట్ర పర్యటన ముగించుకొని ప్రధాని గంట వ్యవధిలోనే మరో పక్క రాష్ట్రమైన తమిళనాడు( చెన్నై)కు వెళ్లారు.  అక్కడి ముఖ్యమంత్రి(యూపీఏ భాగస్వామి) ఎంకే స్టాలిన్ అధికారికంగా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ప్రధాని చేతుల మీదుగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించుకున్నారు. దేశ ప్రధానికి ఇయ్యాల్సిన గౌరవం ఇస్తూనే.. తమిళ భాషకు ప్రాధాన్యం, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన సమస్యలపై ప్రధానితో చర్చించారు. ప్రధాని మోడీ కూడా దాన్ని సానుకూలంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సిద్ధాంతపరమైన విభేదాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా స్టాలిన్​ గొప్ప రాజనీతి ప్రదర్శిస్తూ వస్తున్నారు. 

కరుణానిధి పాత్ర..
సీఎం కేసీఆర్​ మే 26న ప్రధాని మోడీని కలవాల్సింది. కానీ ఆయన -మాజీ ప్రధాని దేవె గౌడను కలిశారు. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ మాత్రం -ప్రధాని మోడీని కలిశారు. కేంద్ర, రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తి కోసం ఎందరో నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బసు, కరుణానిధి, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ లాంటి నాయకులు అందులో ప్రముఖులు. 1969లో ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలినాళ్లలో కరుణానిధి కొన్ని ముఖ్యమైన కమిషన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర, -రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి, రాష్ట్రాలకు ఏ అధికారాలను బదిలీ చేయాలనే దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా తన మొదటి న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా.. మార్చి 1969లో కరుణానిధి మాట్లాడుతూ.. అత్యంత స్వయంప్రతిపత్తిని పొందే చర్యలను సూచించడానికి రాజ్యాంగ నిబంధనలను పరిశీలించడానికి డాక్టర్ పీవీ రాజమన్నార్ నేతృత్వంలో నిపుణుల కమిటీ  ఏర్పాటుకు తన ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 1971 మే 27న సమర్పించిన రాజమన్నార్ కమిటీ సిఫార్సులు సమాఖ్య రాజ్యాంగం దిశగా ఒక సమగ్ర రోడ్​మ్యాప్‌‌‌‌‌‌‌‌ను రూపొందించాయి. సీఎంలందరితో కూడిన అంతర్- రాష్ట్ర మండలి  ఏర్పాటు నుంచి  పీఎం ఛైర్మన్‌‌‌‌‌‌‌‌గా, గవర్నర్ల నియామకం వరకు ఈ కమిటీ కీలక సిఫారసులు చేసింది. 

సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు
కరుణానిధి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ జాతీయ ప్రభుత్వంలో ఎన్నడూ పాత్రను కోరుకోలేదు. ఢిల్లీలో పదవి కోసం ఆశపడలేదు. దేశాన్ని విజయవంతంగా నడిపిన సుస్థిర సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడంలో దేశానికి ఆయన చేసిన సేవ మరువలేనిది. 1999లో వాజ్‌‌‌‌‌‌‌‌పేయి నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్, 2004, 2009లలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం రెండు సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ఆయన దాన్ని సాధించారు. కరుణానిధి రాజకీయ జ్ఞానం కారణంగా ఈ రెండు సంకీర్ణ ప్రభుత్వాలు స్థిరంగా ఉండగలిగాయి. దక్షిణాది నుంచి చాలా పెద్ద నాయకుల్లో ఒకరిగా ఉన్నందున ఆయన కేంద్రంలో పాత్ర కోసం ఆశించవచ్చు. కానీ అలా చేయలేదు. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాలకు ఆయన మద్దతు తెలుపడం వల్ల తమిళనాడుకు  రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలు తదితర అనేక పనులను ఆయన మంజూరు చేయించుకున్నారు.

- సూర్యపల్లి శ్రీనివాస్, ఓబీసీ పాలసీ రీసెర్చర్, బీజేపీ తెలంగాణ