- టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలని బీఎస్పీ నేతలు..
- పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మధ్యాహ్న భోజనం వర్కర్స్
- అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలని సీపీఎం లీడర్లు..
సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు: సూర్యాపేట, నల్గొండ కలెక్టరేట్లు సోమవారం ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లాయి. టీఎస్‌పీఎస్సీ బోర్డు రద్దు చేయాలని బీఎస్పీ నేతలు, సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకే ఇవ్వాలని సీపీఎం లీడర్లు, జీవో 142 రద్దు చేయాలని వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు, వేతనాలు పెంచాలని మెప్మా సిబ్బంది, పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు. సూర్యాపేటలో బీఎస్పీ నాయకులు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అలర్ట్ అయిన పోలీసులు అరెస్ట్ చేసి చివ్వెంల స్టేషన్‌కు తరలించారు.
గ్రూప్–1పై సీబీఐ ఎంక్వైరీ జరపాలి
గ్రూప్–1 ఎగ్జామ్‌పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. నల్గొండలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేశ్ చౌహన్ , ప్రధాన కార్యదర్శి జాడి రాజు, జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, సూర్యాపేటలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుడిగే మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం 33 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో సహా కమిటీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. వెంటనే కొత్త కమిటీని నియమించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని , పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి రూ.1లక్ష ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలకే వెల్ఫేర్ స్కీమ్స్
ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకాలను బీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ.. గతంలో పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ హయాంలో కొందరు అర్హులకైనా సంక్షేమ పథకాలు అమలు చేసేవారని, ఇప్పుడు ఒక్కరికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లెందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో..
తమకు గొడ్డలిపెట్టులా మారిన జీవో 142ను రద్దు చేయాలని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ డివిజినల్ పరిధిలోని డిప్యూటీ డీఎంహెచ్‌వో పోస్టులను తొలగించడం, ఆఫీసులో పని చేస్తున్న సిబ్బందిని ఇతర చోట్లకు బదిలీ చేయడం, ఉపయోగంలో లేని కార్యాలయాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో ఆఫీసులను రద్దు చేయడం లాంటి చర్యలు సరికావన్నారు. ప్రజలకు అనుగుణంగా ఉద్యోగులు, ఆఫీసులు పెరగాలే తప్ప తగ్గించడం ఏంటని మండిపడ్డారు.
మెప్మా ఆర్పీల ఆధ్వర్యంలో..
మెప్మా ఆర్పీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరుతూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషిస్తున్న తమకు కేవలం రూ.4 వేలు ఇస్తున్నారని వాపోయారు. వేతనం పెంచడంతో పాటు యూనిఫాం, గుర్తింపు కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.
మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో..
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా కమీషన్ పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి కోరారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
విద్యా శాఖ మంత్రి రూ.3 వేలు ఇస్తామని ప్రకటించి జీవో విడుదల చేసినా నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఇవ్వకపోడంతో అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ జే. జంగమ్మ, కార్యదర్శి బంటు రాజేశ్వరి, నేతలు వెంకట రాములు, మల్లయ్య, సైదులు, లక్ష్మయ్య, శేఖరాచారి, సైదమ్మ పాల్గొన్నారు.