సూర్యాపేట, వెలుగు: ఈ నెల 16న జరగనున్న గ్రూప్ 1 ఎగ్జామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు. ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 ఎగ్జామ్‌కు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 9,181 మంది హాజరుకానున్నారని, వీరి కోసం 31 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగ్జామ్స్ కోసం 12 మంది లైజన్ ఆఫీసర్లు, 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31 మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించామన్నారు. ఎగ్జామ్స్ సజావుగా సాగేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని సెంటర్లలో తాగునీరు అందుబాటులో ఉంచాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాండిడేట్లు ఎగ్జామ్ సెంటర్‌కు గంటన్నర ముందుగా చేరుకోవాలని సూచించారు. అన్ని సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీ నాగభూషణంను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, ఇన్‌చార్జి డీఆర్‌వో రాజేంద్రకుమార్, ఏవో శ్రీదేవి, డీఈవో అశోక్ పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హాజరై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సమస్యలను నిర్భయంగా తెలపాలని సూచించారు. ప్రజావాణిలో పెన్షన్ సమస్యపై 49, భూ సంబంధిత సమస్యలపై 22 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వాటిని ఆయా డిపార్ట్‌మెంట్లకు పంపించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.