ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట, వెలుగు : వెనుకబడిన స్టూడెంట్లకు మెరుగైన విద్య అందించడమే ‘తొలిమెట్టు’ కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ చెప్పారు. శనివారం కలెక్టరేట్ లో క్లస్టర్ నోడల్ ఆఫీసర్లతో ‘తొలిమెట్టు’ జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్టూడెంట్లలో విద్యపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి స్టూడెంట్​కు మ్యాథ్స్​ నేర్పించడంలో టీచర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  స్టూడెంట్ల అటెండెన్స్, తల్లిదండ్రుల భాగస్వామ్యం, అభ్యసన ప్రక్రియను సక్సెస్​ చేయడం  కోసం ‘తొలిమెట్టు’ శిక్షణలో నేర్పించిన అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రతి స్టూడెంట్​ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు  రాసే విధంగా టీచర్లు తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో సూర్యాపేట జిల్లాను ఫస్ట్​ప్లేస్​లో నిలిపేందుకు  ప్రతి  ఒక్కరూ   కృషి చేయాలని పిలుపునిచ్చారు.  డీఈవో అశోక్ , ఎంఈవో జనార్దన్, సీఎంవో రాంబాబు, ఎంఈవోలు, హెడ్​మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలు సాధించాలి
యాదాద్రి, వెలుగు :
ప్రణాళికాబద్ధమైన బోధన ద్వారా స్కూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్​లో  విద్యాశాఖ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. స్టూడెంట్లకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు వారిలోని ప్రతిభను వెలికితీసేలా  బోధించాలన్నారు.  స్టూడెంట్లు స్పీకింగ్​, రైటింగ్​లో  తప్పులు  లేకుండా టీచర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. స్టూడెంట్ల ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడంతో పాటు వారి మనో వికాస అభివృద్ధికి స్కూల్​ఉపయోగ పడాలని అన్నారు. కమలాకర్ రెడ్డి,  విజయలక్ష్మి,  వెంకన్న, సంధ్య, భాస్కర్ రెడ్డి భోదనాభ్యసన గురించి వివరించారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ దీపక్​ తివారి, 
డీఈవో కే నారాయణరెడ్డి ఉన్నారు.

దొంగతనం కేసులను స్పీడ్​గా చేధించాలి : ఎస్పీ రాజేంద్రప్రసాద్ 
సూర్యాపేట, వెలుగు :
దొంగతనం కేసులను పోలీసులు స్పీడ్​గా చేధించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం ‘దొంగతనాల నివారణ, సొమ్ము స్వాధీనం, దొంగల గుర్తింపు’ పై జిల్లా పోలీస్ ఆఫీస్​లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ఎవరైనా ఎక్కువ కాలం ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు పోలీసులకు, పక్కన వారికి సమాచారం ఇవ్వాలన్నారు.  ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా , భద్రతాపరమైన చర్యలను స్వతహాగా పాటించేలా పోలీసులు అవగాహన కల్పించాలన్నారు. దొంగతనం జరిగితే సొమ్ము రికవరీకి  టెక్నాలజీని ఉపయోగించుకుని నిందితులను వేగంగా పట్టుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే నిఘా పెట్టాలన్నారు. డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్​రెడ్డి, రవి,  ఎస్​బీ సీఐ  శ్రీనివాస్,  డీసీఆర్బీ సీఐ నరసింహ, సీఐలు రాజశేఖర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలు మరవలేనివి 
విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.  ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా  సూర్యాపేట టౌన్  పీఎస్​లో పోలీసులు, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని  ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.  పోలీసు సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు గణేశ్, కోటేశ్వరి తదితరులు  పాల్గొన్నారు. 

గుట్టలో ప్రమాణం చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌ కృష్ణారెడ్డికి టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు
నల్గొండ, వెలుగు :
ఎలక్షన్‌  రూల్స్​కు  విరుద్ధంగా యాదగిరిగుట్టలో ప్రమాణం చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం నల్గొండలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనాలని చూసి అడ్డంగా దొరికిన వ్యక్తులు దేవుడి దగ్గర ప్రమాణం చేయడం దారుణమన్నారు. ప్రజల చేతిపైన పువ్వు గుర్తు వేయడం ఎలక్షన్‌ రూల్స్​కు విరుద్ధం అన్నారు. మద్యం, డబ్బు పంపిణీ చేసి మునుగోడులో గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. వారి వెంట నాయకులు రావుల శశిధర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సోమగాని భరత్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మందిడి సైదిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

మున్నూరు కాపు భవనాలకు సొంత నిధులు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
చండూరు, వెలుగు :
మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒకటి చొప్పున మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్స్ నిర్మించేందుకు సొంత నిధులు కేటాయిస్తానని ఎంపీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రకటించారు. శనివారం మర్రిగూడ, గట్టుప్పల్​మండలాల మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం మర్రిగూడెం మండలం సరంపేటలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో జరిగింది. హాజరైన రవిచంద్ర మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు 7 కమ్యూనిటీ హాల్స్ తో పాటు చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లోనూ  నిర్మించేందుకు  రూ.10 లక్షలు చొప్పున  రూ. 90 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మున్నూరు కాపులంతా ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్​ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్​కు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు లీడర్లు సర్ధార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్, విష్ణు, జెన్నాయికోడె జగన్​మోహన్ ​తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన పసుపు రైతుల ఐక్యవేదిక లీడర్లు
మునుగోడు, వెలుగు :
నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల ఐక్య వేదిక లీడర్లు శనివారం బీజేపీలో చేరారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌ కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 25 మంది పసుపు రైతులు సైతం ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేసే కుట్ర
చండూరు, వెలుగు : సీఎం కేసీఆర్‌ను తెలంగాణకు పరిమితం చేయాలన్న కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చిందని ఎమ్మెల్యే తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఆరోపించారు. తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్‌ వస్తుండడంతో బీజేపీ లీడర్లు నిద్ర పట్టడం లేదన్నారు. నల్గొండ జిల్లా చండూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయారని, కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పెట్టగానే బీజేపీ ఉలిక్కి పడుతోందన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌దే విజయమని దీమా వ్యక్తం చేశారు.సమావేశంలో ఎమ్మెల్సీ సారయ్య ఉన్నారు.

కేసీఆర్​ ఇంటర్నేషనల్​ కేడీ
యాదాద్రి, వెలుగు :
కాంగ్రెస్​ భిక్షతో సీఎం అయిన కేసీఆర్​, ఇంటర్నేషనల్​ కేడీగా ప్రజలందరినీ మోసం చేస్తున్నారని  కాంగ్రెస్ ​సీనియర్​నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురం మండలం కోతులాపురంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్​ భిక్ష పెట్టేంతవరకూ దిక్కులేని కేసీఆర్, ఢిల్లీ, గల్లీలోనూ  కాంగ్రెస్​ లేదంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్​ నుంచి బీఆర్ఎస్​, ఆ తర్వాత ఐఆర్ఎస్​ అవుతుందని  అపహాస్యం చేశారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కాంగ్రెస్​లోనే ఉంటూ తమ్ముడికి ఓటేయాలని కోరడంపై ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్​ను మోసం చేసి, ఒక్క దగ్గరకు చేరిన అన్నదమ్ములకు మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్రు
చౌటుప్పల్‌, వెలుగు :
కేంద్రం అమలు చేస్తున్న పథకాలను సీఎం కేసీఆర్‌ తనవిగా చెప్పుకుంటున్నారని బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావుతో కలిసి గురువారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌, లక్కారంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎన్నికలతో సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనకు చెక్‌ పడుతుందని, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన డబ్బులు తీసుకొని బీజేపీ క్యాండిడేట్‌ రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని సూచించారు. ఆయన వెంట నందకుమార్‌యాదవ్‌, జనగాం నర్సింహాచారి, రాఘవుల నరేందర్, కౌన్సిలర్లు సైదులు, మంజుల ఉన్నారు.  

రాజగోపాల్ రెడ్డిని ఆదరించండి : కోమటిరెడ్డి లక్ష్మి  
చండూరు, (మర్రిగూడ,) వెలుగు :
నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి  ఓటర్లను అభ్యర్థించారు. శనివారం మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి లో  ఆమె ప్రచారం చేశారు. నాలుగేండ్ల నుంచి  మునుగోడు అభివృద్ధి కోసం  రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో  ఎన్నో సార్లు  గళమెత్తారని, కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే  అని  ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. నియంత పాలన చేస్తున్న కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే  కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమవుతుందని  ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్నారని తెలిపారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. 

వేరే పార్టీ కాబట్టే మునుగోడు అభివృద్ధి జరగలేదు

అంబేద్కర్‌ విగ్రహం ఇప్పిస్తా.. 

మాల సంఘానికి చెందిన ఓట్లన్నీ టీఆర్ఎస్‌కే వేయాలి : మంత్రి గంగుల కమలాకర్​    

యాదాద్రి, వెలుగు : ‘సర్పంచ్‌ నుంచి సీఎం వరకు అంతా ఒకే పార్టీ కాబట్టి అంతటా అభివృద్ధి జరిగింది, వేరే పార్టీకి చెందిన రాజగోపాల్‌రెడ్డి నల్ల మచ్చలా ఉన్నారు. అందుకే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది, ఈ సారి ఆ మచ్చను తొలగించాలి’ అని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో శనివారం జరిగిన అంబేద్కర్‌ మాల యువజన సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నిక గుజరాత్‌ బానిసలు, తెలంగాణ ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పారు. గత ఎన్నికల్లో తప్పు జరగడం వల్ల రాజగోపాల్‌రెడ్డి గెలిచాడని, ఈ సారి మళ్లీ అదే తప్పు జరిగితే రోజుకో స్వార్థపరుడు తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోతాడన్నారు. ఈ ఒక్క ఎన్నికతో రాష్ట్రంలో ఏమీ మారదని చెప్పారు. అంబేద్కర్‌ విగ్రహం ఇప్పించేందుకు ఎలాంటి కండిషన్స్‌ లేవంటూనే అయితే మాల సంఘానికి సంబంధించిన  ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేయాలన్నారు. 

రెండు మండలాల్లో నలుగురు మంత్రుల పర్యటన
యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ పర్యటించారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రచారం చేయగా, మిషన్‌ భగీరథ పైలాన్‌ వద్ద ప్లోరోసిస్‌ బాధితులు నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. ముస్లిం మైనార్టీలతో మరో హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రచారం చేశారు. అలాగే సంస్థాన్‌ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇంటింటి ప్రచారం 
నిర్వహించారు. 

అవినీతి సర్కారుకు బుద్ధి చెప్పాలి
చౌటుప్పల్​, వెలుగు :
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని టీపీసీసీ మెంబర్, ఆలేరు ఇన్​చార్జి బీర్ల అయిలయ్య కోరారు. శనివారం చౌటుప్పల్​ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్​ఆనందరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ఈ అవినీతి, నియంతృత్వ సర్కారుకు బుద్ధి చెప్పాలని కోరారు. అధికార గర్వంతో ఉన్న టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్​ గెలిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రచారంలో ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్​ తదితరులు పాల్గొన్నారు.  

ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేయాలి

రెండో రోజుకు చేరిన ‘బస్వాపూర్’  నిర్వాసితుల ఆందోళన
యాదగిరిగుట్ట, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లప్పనాయక్ తండా వాసులు డిమాండ్ చేశారు. ఆర్అండ్​ఆర్​ ప్యాకేజీ ఇవ్వాలని రిజర్వాయర్​వద్ద నిర్వాసితులు చేస్తున్న దీక్ష  శనివారం రెండోరోజుకు చేరింది. తండా సర్పంచ్ బుజ్జి నిర్వాసితులతో కలిసి రిజర్వాయర్ నిర్మాణానికి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, వ్యవసాయ భూములు కోల్పోయిన బాధితుల్లో కొందరికి ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదన్నారు. దాతరుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 294లో 30 ఎకరాల్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్యాకేజీ ప్రకారం.. 250 కుటుంబాలకు రూ.7.61 లక్షల చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ నెరవేర్చేవరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చెప్పారు.  ఉప సర్పంచ్ మంక్యా నాయక్, మాజీ సర్పంచ్ గాశీరాం, వార్డు సభ్యులు యాదమ్మ, మోహన్, సురేశ్, భారతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.  

మంత్రి జగదీశ్​రెడ్డిపై చర్య తీసుకోవాలి
యాదాద్రి​, వెలుగు:
క్యూ న్యూస్ ఆఫీస్​పై దాడి చేయించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డిపై చర్య  తీసుకోవాలని ‘తీన్మార్​మల్లన్న 7200’  టీం డిమాండ్​ చేసింది. యాదాద్రి కలెక్టరేట్ ఎదుట మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా  టీం జిల్లా కన్వీనర్​ బుద్దుల సునీత మాట్లాడుతూ.. మంత్రిని విమర్శించారని మీడియా ఆఫీసులపై దాడి చేయడం సరికాదన్నారు. రామన్నపేట, మోత్కూరు మండలాల కన్వీనర్లు భిక్షపతి, ఉపేందర్, కుమార్, ప్రవీణ్, సాయి, వెంకటేశ్ ఉన్నారు.

కల్లు జీవన విధానం : బి. వినోద్​కుమార్​
యాదాద్రి, వెలుగు:
కల్లు మద్యం కాదు.. మన జీవన విధానమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్​ కుమార్​ అన్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురంలో నిర్వహించిన గీత కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిషేధించిన కల్లు దుకాణాలను తెరిపించి గీత కార్మికులకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే​ దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. గీత కార్మికులకు టీఆర్​ఎస్ అండగా నిలబడిందని, కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిని గెలిపించాలని వినోద్​కోరారు.