- 10 శాతం ఇస్తే.. ప్రతి బిల్లు పాస్
- అక్రమాలకు కేరాఫ్‌గా సూర్యాపేట డీఈవో ఆఫీస్
- అన్ని బిల్లులపై పర్సంటేజీ వసూలు
- వాడని సామగ్రికీ బిల్లులు పెడుతున్న సిబ్బంది
- చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అక్రమాలకు కేరాఫ్‌గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి ఆఫీసర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ ఇన్‌చార్జులే ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. తాము చెప్పిన పర్సంటేజీ ఇస్తే చాలు కొందరు సిబ్బంది ఏ బిల్లును అయినా పాస్ చేస్తున్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందికి ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
10 శాతం ఇస్తే చాలు.. ఏ బిల్లు అయినా ఓకే
కేజీబీవీల్లో ఫుడ్, ఇతర సామగ్రి పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఈ బిల్లులపై ఎలాంటి వెరిఫికేషన్ ఉండకపోవడంతో తమ ఇష్టారాజ్యంగా బిల్లులు డ్రా చేస్తున్నారు. జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్, మద్దిరాల, నడిగూడెం, మఠంపల్లి మండలాల్లోని కేజీబీవీల్లో వంట కోసం గ్యాస్ సిలిండర్లు వాడుతున్నప్పటికీ కట్టెలు ఉపయోగిస్తున్నట్లు ప్రతి నెలా రూ. 10 వేలకు పైగా బిల్లులు పెడుతున్నారు. ఆఫీసర్లు ఇటు గ్యాస్ బిల్లులతో పాటు, అటు కట్టెల బిల్లులను సైతం పాస్ చేస్తున్నారు. అలాగే కొన్ని మండలాల్లోని కేజీబీవీల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా వాటర్ క్యాన్లు వాడుతున్నట్లు వేలల్లో బిల్లులు డ్రా చేస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ బిల్స్ ఆరు నెలలకు ఒకసారి పెట్టాల్సి ఉన్నా కొందరు అదేమీ పట్టించుకోకుండా ప్రతి నెలా రూ. 20 వేల చొప్పున డ్రా చేస్తున్నారు. డీఈవో ఆఫీస్‌లో పనిచేసే సిబ్బంది ప్రతి బిల్లుపై 10 శాతం వసూలు చేస్తూ బిల్లులను పాస్ చేస్తున్నట్లు ఓ ఉద్యోగి చెప్పారు. ఆఫీసులో పనిచేసే ఓ మహిళా ఆఫీసర్ కింది స్థాయి సిబ్బందితో కలిసి పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అవినీతి సిబ్బందికి ఆఫీసర్ల అండ
అవినీతి సిబ్బందికి కొందరు ఆఫీసర్లు అండగా నిలుస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ కంప్యూటర్ ఆపరేటర్ అక్రమాలకు పాల్పడడంతో అతడిని అప్పటి కలెక్టర్ నల్గొండకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయినా అతడు మళ్లీ సూర్యాపేట ఆఫీస్‌లోనే డ్యూటీ చేయడం గమనార్హం. సూర్యాపేట కేజీబీవీలో మెనూ పాటించడం లేదని, ఫుడ్ సరిగా పెట్టడం లేదని ఇటీవల పేరెంట్స్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. అయినా ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయకుండా జాజిరెడ్డి గూడెం కేజీబీవీకి ట్రాన్స్‌ఫర్ చేసి వదిలేశారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
పర్సంటేజీల విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం. కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్‌కు వచ్చిన మాట వాస్తవ మే. కానీ ఎలాంటి బిల్లులు చేయడం లేదు. అశోక్, డీఈవో, సూర్యాపేట
కాంగ్రెస్‌ది జోడో యాత్ర కాదు, చోడో యాత్ర : మంత్రి మల్లారెడ్డి
చౌటుప్పల్, వెలుగు : కాంగ్రెస్ లీడర్లు చేస్తున్నది జోడో యాత్ర కాదు.. చోడో యాత్ర అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, కాట్రేవు, రెడ్డి బావి గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, పెన్షన్‌దారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు. కరోనా టైంలోనూ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతోనే దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. రాజగోపాల్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మునుగోడును అభివృ-ద్ధి చేయాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో దివాలా తీసిందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌కి వీఆర్‌ఎస్ ఇవ్వాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్
చండూరు (నాంపల్లి), వెలుగు : మునుగోడులో టీఆర్‌ఎస్‌ను ఓడించి, జాతీయ స్థాయిలో పెడుతున్న బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చి ఇంటికి పంపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని మేళ్లవాయి, పులికుంట్ల, సుంకిశాల, మేళ్లవాయి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏం అభివృద్ధి చేశారని తెలంగాణ మోడల్ అంటున్నారని ప్రశ్నించారు. ఇంటింటికీ వాచ్, చీరలు, మద్యం పంచడం కాదని, గుడిసెల్లో బతికే ప్రజల బతుకులు మార్చాలన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ, మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారన్నారు. అన్ని పార్టీలు ఆధిపత్య వర్గాలకే టికెట్లు ఇచ్చి బహుజనులను మోసం చేశారన్నారు. కేసీఆర్‌తో పాటు వంద మంది వచ్చి కాళ్లు మొక్కినా నమ్మొద్దని సూచించారు. అందరి కోసం పనిచేసే బీఎస్పీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, నాయకులు నర్సింహ, నిర్మల, ఎలిజబెత్, సుజాత, కవిత
పాల్గొన్నారు.
ఎలక్షన్ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండొద్దు
నల్గొండ, వెలుగు : మునుగోడు ఎలక్షన్ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండొద్దని నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఎలక్షన్‌లో పాల్గొనే సిబ్బందికి శుక్రవారం చండూరు ఎంపీడీవో ఆఫీస్‌లో నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీని అడ్డుకోవాలని ఆదేశించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ పోలీసులు ఇతర శాఖలతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, వెంకటేశ్వర్లు, బాలు, సోమయ్య అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, నల్గొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే డెవలప్‌మెంట్
యాదాద్రి (ఆత్మకూరు(ఎం), వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ మెంబర్, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలానికి చెందిన పలువురు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
15న నుంచి సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 15 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కర్నల్ కీట్స్‌దాస్ చెప్పారు. ర్యాలీ నిర్వహణపై శుక్రవారం సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి స్థానిక ఎస్‌వీ డిగ్రీ కాలేజీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ తేదీ వరకు ర్యాలీ జరగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్యాండిడేట్లు హాజరు కానున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ర్యాలీ జరిగే ఏరియాలో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో మెటల్ డిటెక్టర్‌ను సైతం ఏర్పాటు చేయాలన్నారు. గ్రౌండ్‌లో బారీకేడ్లు, లైటింగ్, మైక్‌లు, మంచినీటి సరఫరా, అత్యవసర వైద్య సేవలు, రెండు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే ఆర్మీ ఆఫీసర్ల కోసం సమీప రైల్వే స్టేషన్ నుంచి రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, ఇన్‌చార్జి డీఆర్‌వో రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఆర్టీవో వెంకటయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, ఆర్‌అండ్‌బీ ఈఈ యాకూబ్, సీఎండీ వీవీ.నాయుడు పాల్గొన్నారు.
ఎన్నికల బందోబస్తు పకడ్బందీగా ఉండాలి
చౌటుప్పల్, వెలుగు : మునుగోడు ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఐజీ కమలాసన్ రెడ్డి ఆదేశించారు. నల్గొండ, యాదాద్రి జిల్లా ఆఫీసర్లతో శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దివీస్ ఫార్మా కంపెనీలో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున హైవేలపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రూ. 10 లక్షల లోపు దొరికితే రిటర్నింగ్ ఆఫీసర్‌కు, అంతకు మించి దొరికితే ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించాలని సూచించారు. సోషల్ మీడియాపై ప్రత్యేకంగా మానిటరింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరక ర పోస్టులు పెడితే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి పాల్గొన్నారు.
‘బీసీలకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు’
చౌటుప్పల్, వెలుగు : మునుగోడులో బీసీలకు టికెట్ ఇవ్వకుండా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మోసం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అధికశాతం ఉన్న బీసీల ఆకాంక్షలను మూడు పార్టీలు గౌరవించలేదన్నారు. మునుగోడు టికెట్ బీసీలకు ఇవ్వాలని మూడు పార్టీలకు లెటర్ రాసినా పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిండికేట్‌గా మారి అగ్రకులాలకే టికెట్ కేటాయించాయని విమర్శించారు. తెలంగాణలో ఏం చేశారని సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ మూడు పార్టీల లీడర్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కథ కంచికి చేరడం ఖాయమన్నారు. సమావేశంలో బీసీ యువజన సంఘం నాయకులు వీరమల్ల కార్తీక్‌గౌడ్, కొత్త భాను తదితరులు
పాల్గొన్నారు.
టీడీపీ హయాంలోనే మునుగోడుకు కృష్ణా జలాలు
మునుగోడు, వెలుగు : మునుగోడు నియోజకవర్గానికి టీడీపీ హయాంలోనే కృష్ణా జలాలు అందించామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునుగోడు ఇన్‌చార్జి జక్కలి ఐలయ్య యాదవ్ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లిలో శుక్రవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య, పార్లమెంట్ అధికార ప్రతినిధి మక్కిన అప్పారావు పార్లమెంట్ కార్యనిర్మాణ కార్యదర్శి గుమ్మడి గోవర్ధన్‌రెడ్డి ఎండీ. హన్నుబాయ్ పాల్గొన్నారు.
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
యాదాద్రి, వెలుగు : భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ యాదాద్రి జిల్లా జడ్జి వి.బాలభాస్కర్‌రావు శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన మేస్త్రి బి.మహేశ్, శివానికి 2003లో పెండ్లి అయింది. తాగుడుకు బానిసైన మహేశ్ భార్య శివానిని అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో 2016 డిసెంబర్ 24న పనికి వెళ్లి తిరిగి వచ్చిన శివానిని తిట్టడంతో పాటు, కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి ఆమెను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించిన తర్వాత పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం సేకరించారు. శివానీ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ 2017 జనవరి 3న చనిపోయింది. దీంతో పోలీసులు మహేశ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మహేశే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జీవిత ఖైదుతో పాటు, రూ. 10 వేల పైన్ వేస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
యాదాద్రి, వెలుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా రాయగిరిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. భువనగిరి రూరల్ ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగరకు చెందిన గారిగంటి శ్రీనివాస్ హైదరాబాద్ అంబర్‌పేటలో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా సందర్భంగా గ్రామానికి వచ్చిన శ్రీనివాస్ శుక్రవారం రాత్రి ఆటోలో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో భువనగిరి మండలం రాయగిరి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్‌ను గాంధీ హాస్పిటల్‌కు తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.
14 గేట్ల ద్వారా నీటి విడుదల
హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,61,342 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 14 గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 1,13,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి కుడికాల్వకు 9,104 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 6,556, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరదకాల్వకు 400, మెయిన్ పవర్ హౌజ్ ద్వారా 29,882 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు పెరిగిన వరద మేళ్లచెరువు (చింతలపాలెం),
వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు శుక్రవారం వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1.84 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ఆరు గేట్లను ఎత్తి 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
యాదాద్రి, వెలుగు : భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ యాదాద్రి జిల్లా జడ్జి వి.బాలభాస్కర్‌రావు శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన మేస్త్రి బి.మహేశ్, శివానికి 2003లో పెండ్లి అయింది. తాగుడుకు బానిసైన మహేశ్ భార్య శివానిని అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో 2016 డిసెంబర్ 24న పనికి వెళ్లి తిరిగి వచ్చిన శివానిని తిట్టడంతో పాటు, కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి ఆమెను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించిన తర్వాత పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం సేకరించారు. శివానీ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ 2017 జనవరి 3న చనిపోయింది. దీంతో పోలీసులు మహేశ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మహేశే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జీవిత ఖైదుతో పాటు, రూ. 10 వేల పైన్ వేస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.