- 2019లో ప్రారంభమైన రోడ్డు విస్తరణ
- సగం కూడా పూర్తి చేయని కాంట్రాక్టర్, పట్టించుకోని ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి తోడు, ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం కారణంగా సూర్యాపేట అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడేళ్ల కింద ప్రారంభమైన పనులు ఏడాది కిందే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటివరకు సగం కూడా కాలేదు. కనీస ముందస్తు ప్రణాళిక లేకుండా పనులు చేస్తుండడంతో మిషన్ భగీరథ పైపులు దెబ్బతింటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులు కూడా నాసిరకంగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆఫీసర్లకు కమీషన్లు అందుతుండడంతోనే క్వాలిటీ లేకుండా, లేట్‌గా పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడేళ్లుగా సాగుతున్న పనులు
సూర్యాపేట పట్టణంలో అభివృద్ధి పనులు చేసేందుకు 2017లో ప్రపోజల్స్ పెట్టారు. ఇందులో ఏడు జంక్షన్ల అభివృద్ధికి అప్రూవల్ వచ్చింది. దీంతో పట్టణంలోని రాఘవ ప్లాజా నుంచి ఖమ్మం రోడ్ వరకు 1.2 కిలోమీటర్ల రోడ్డును రూ. 1.26 కోట్లతో విస్తరించేందుకు ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్ చర్యలు చేపట్టింది. పనులను సూర్యాపేటకు చెందిన డీఎస్‌ఐఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించింది. 2019లో ప్రారంభమైన పనులు రెండేళ్లలో అంటే 2021లోనే పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ గడువు ముగిసి ఏడాది కావొస్తున్న ఇప్పటికీ 50 శాతం పనులు కూడా జరగలేదు. దీంతో రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ షాపింగ్ కాంప్లెక్స్ కోసమే పనులను ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పగులుతున్న భగీరథ, డ్రైనేజీ పైపులు
పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో కనీస నిబంధనలు పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోడ్డు పనుల కంటే ముందే డ్రైనేజీ, పైప్‌లైన్, కేబుల్ వర్క్స్ చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా నేరుగా బీటీ వేశారు. దీంతో ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే రోడ్డు కోసం తవ్విన గుంతల్లో డ్రైనేజీ, మిషన్ భగీరథ పైప్‌లు ఉండడంతో అవి పగిలి లీకేజీలు ఏర్పడుతున్నాయి. నల్లా కనెక్షన్లు కూడా తెగిపోవడంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డివైడర్లను సైతం ఇష్టానుసారంగా నిర్మించారని పలువురు అంటున్నారు.
పైప్‌లైన్ కోసం మరో రూ. 53 లక్షలు
ఇష్టానుసారంగా చేసిన పనుల వల్ల పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో వాటికి రిపేర్లు చేసేందుకు మున్సిపల్ ఆఫీసర్లు రూ. 53 లక్షల డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌ను కేటాయించారు. అయితే అనుభవం లేని వారికి రోడ్డు కాంట్రాక్ట్ కట్టబెట్టడంతోనే పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముందుకు పడని జంక్షన్ల అభివృద్ధి
సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత జనాభాను దృష్టిలో పెట్టుకొని సూర్యాపేట మున్సిపాలిటీలో ఏడు జంక్షన్ల అభివృద్ధితో పాటు రోడ్ల వెడల్పుకు 2017లో చర్యలు చేపట్టారు. మొదట జమ్మిగడ్డ నుంచి మెయిన్ రోడ్డు, పోస్ట్ ఆఫీస్ వరకు పనులు ప్రారంభించగా బాధితులకు పరిహారం ఇవ్వకపోవడంతో పనులను మధ్యలోనే వదిలేశారు. దీనితో కొన్ని రోజులు రోడ్ల వెడల్పునకు ఆటంకం ఏర్పడ్డగా ఇటీవలే పోస్ట్ ఆఫీస్ నుంచి కోర్టు చౌరస్తా, ఎస్‌వీ కాలేజీ వరకు పనులను ప్రారంభించారు. మిగిలిన జంక్షన్ల పనులను అసలు చేస్తారో.. లేదోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దెబ్బతిన్న పనులు తిరిగి చేపడతాం
రోడ్డు విస్తరణలో దెబ్బ తిన్న డ్రైనేజీని తిరిగి నిర్మిస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట
ఇవి కూడా చదవండి
తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..