- రూలింగ్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసిన 150 మంది ముఖ్య నేతలు
- శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటన
సూర్యాపేట, వెలుగు: మంత్రి జగదీశ్‌రెడ్డి ఇలాకాలో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్పై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభావం పడింది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా ఆయన వెంట నడిచేందుకు సూర్యాపేట బీఆర్‌ఎస్ నాయకులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 150 మంది ముఖ్య నేతలు బుధవారం మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ అసమ్మతి నేత పెద్దిరెడ్డి రాజా తన అనుచరులతో కలిసి పొంగులేటి వెంట కాంగ్రెస్ లో చేరుతున్నట్లు మీడియాలో చెప్పారు. పొంగులేటితో చర్చలు
ప్రస్తుతం బీఆర్ఎస్ ను వీడిన కొంతమంది నాయకులు ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అధికార పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు పక్కా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా గత పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన అనుచరులతో బీఆర్‌ఎస్ లో చేరారు. అయితే పార్టీలో చేరిన నాటి నుంచి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఎనిమిది నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పొంగులేటితో ఉన్న సన్నిహిత్యంతో పెద్దిరెడ్డి బీఆర్‌ఎస్ అసమ్మతి నేతలతో చర్చలు జరిపి కాంగ్రెస్ లో చేర్పించేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి రాజాతో పాటు సూర్యాపేట బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నేరెళ్ల లక్ష్మి, ఆమె కుమారుడు మధు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శనగని రాంబాబు గౌడ్, ఉద్యమ నాయకుడు భాషాపంగు భాస్కర్, మైనార్టీ నాయకులు సాజిద్ ఖాన్, చివ్వెంల మండల నాయకుడు నరేశ్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.
అధికార పార్టీలో కలవరం..
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉన్నట్లు నేతలు ప్రకటించడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. పార్టీని వీడే వారిలో కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఉన్నట్లు పలువురు నేతలు ప్రకటించడంతో గులాబీ పార్టీ గుండె వేగమందుకుంది. ఒక్క చివ్వెంల మండలం నుంచే దాదాపు వెయ్యి మంది నేతలు పార్టీని వీడుతున్నట్లు, కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీలో ఇమడలేకే..
అధికార పార్టీలో ఇమడలేక కొంత కాలంగా సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమ నాయకులకు, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత దక్కకపోవడంతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవి, టౌన్ పార్టీ అధ్యక్ష పదవిని అర్హత లేని వారికి కట్టబెట్టారని చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారు. నేటికీ మార్కెట్ కమిటీని ప్రకటించకపోవడంపై కూడా అసంతృప్తిగా ఉన్నారు. సెకండ్ కేడర్ ను ఎదగనియకుండా అడ్డుకుంటున్నారన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలువురు నాయకులు బీఆర్ఎస్ను వీడుతున్నట్లు తెలుస్తోంది.