సూర్యాపేట, వెలుగు : వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. భర్త తన చేతులతో భార్యను దారుణంగా హత్యచేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అందరినీ నమ్మించాడు. అంతటితో ఆగకుండా మరో మూడు నెలల వ్యవధిలోనే ప్రియురాలి భర్తను ఇద్దరు స్నేహితులతో కలిసి హత్యచేసి మరోసారి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. దృశ్యం సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
చివ్వెంల మండలం భళ్లు తండాకు చెందిన భూక్యా వెంకన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుటుంబ సభ్యులతో కలిసి భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన షేక్ రఫీ తన భార్య నస్రీన్ తో కలిసి సూర్యాపేటలోని శ్రీరాంనగర్ లో నివాసం ఉంటున్నాడు. భూక్యా వెంకన్నకు, నస్రీస్ కు కొద్ది రోజుల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఒక్కటి కావడం కోసం వెంకన్న తన భార్య రమాదేవిని, నస్రీన్ తన భర్త రఫీని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం వెంకన్న తన భార్యను ఈ ఏడాది జూన్ 8న రాత్రి స్వగ్రామం భళ్లు తండా నుంచి సూర్యాపేటకు బైక్ పై తీసుకెళ్లాడు.
మార్గం మధ్యలో మూత్ర విసర్జన పేరుతో వెహికల్ ఆపి రమాదేవిని విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టి చంపాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో తన భార్య మృతి చెందినట్లు చెప్పాడు. తాను రెండు రోజులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటించాడు. అప్పట్లో చివ్వెంల పోలీసులు ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నస్రీన్ పై అనుమానంతో ఆమె భర్త రఫీ కొద్ది రోజులుగా ఆమెతో ఘర్షణ పడుతున్నాడు. దీంతో రఫీని అడ్డుతొలగించుకోవాలని వెంకన్నతో కలిసి నస్రీన్ ప్లాన్ వేసింది. ఈనెల 9న రాత్రి రఫీ బయటకు వెళ్లాడు. ఇది గమనించిన నస్రీస్.. తన ప్రియుడు వెంకన్నకు ఫోన్ లో సమాచారం అందించింది. వెంకన్న మోతె మండలం సిరికొండకు చెందిన అక్కెనపల్లి శ్రీశైలం, నామారం గ్రామానికి చెందిన సారగండ్ల మధుతో కలిసి రఫీ ఇంట్లోకెళ్లి దాక్కున్నాడు. తిరిగి ఇంటికి చేరుకున్న రఫీని వెంకన్న తన దోస్తుల సాయంతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రఫీ గొంతుకు చీర కట్టి హాల్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు వేలాడదీశారు. ఎవరికీ అనుమానం రాకుండా నస్రీన్ ను బెడ్రూంలో ఉంచి కిటికీలో నుంచి పొడవాటి కర్రసాయంతో గడియ పెట్టి పారిపోయారు. తన భర్త రఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య నస్రీన్ అందరినీ నమ్మించింది.
మృతుడి గదికి గడియ పెట్టి ఉండటంతో పోలీసులు సైతం మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానించారు. రఫీ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. నస్రీన్ మొబైల్ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. నస్రీన్ తో పాటు వెంకన్న, అతని ఫ్రెండ్స్ శ్రీశైలం, మధును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ రెండు హత్యలతో వెంకన్న ఇద్దరు కుమార్తెలు, నస్రీన్ కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు . వారంతా ఆరేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం .