ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించాలి : కలెక్టర్లు ఇలా త్రిపాఠి

ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించాలి : కలెక్టర్లు ఇలా త్రిపాఠి

నల్గొండ/సూర్యాపేట, వెలుగు : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నల్గొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్ నందలాల్ పవార్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ, సూర్యాపేట కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

ప్రతి అధికారి తన పరిధిలో 2కి మించి ఫిర్యాదులను పెండింగ్ లో ఉండకుండా చూసుకోవాలన్నారు. నామమాత్రంగా ఫిర్యాదులను తీసుకోవద్దని, తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ప్రతిరోజు వారికి కేటాయించిన ఏరియాల్లో కనీసం 10 శాతం ఇండ్లను అధికారులు సర్వే చేయాలని చెప్పారు. ప్రజావాణిలో నల్గొండ జిల్లాలో మొత్తం 54, సూర్యాపేట జిల్లాలో 39 ఫిర్యాదులు వచ్చాయి.

గిరిజన ప్రాంతాల్లో దర్తి ఆభ జన జాతీయ ఉత్కర్ష అభియాన్ అమలు.. 

తండాల్లో గిరిజనులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ‘దర్తి ఆభ జన జాతీయ ఉత్కర్ష అభియాన్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా5 ఏండ్లలో 750 గిరిజన తెగలకు సంబంధించిన 5.36 కోట్ల మందికి లబ్ధిచేకూరనుందన్నారు. 26 రాష్ట్రాలు ,4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు రూ.80 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేసే ప్రతిపాదన ఉందని తెలిపారు. నల్గొండ జిల్లాలో  గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న 52 గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు.