సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 18న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు నాడే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు పెట్టారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు 90శాతం పూర్తి కాగా మరో10 శాతం పెండింగ్ పనులు ఉన్నాయి. మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మిస్తున్న పైలన్ పనులు 50 శాతం మాత్రమే పూర్తి కావడంతో స్పీడప్ చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడే..
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో సూర్యాపేటకు వచ్చిన సీఎం కేసీఆర్ మళ్లీ ఇప్పుడే వస్తున్నారు. ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో పాటు మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాజ్ వెజ్ మార్కెట్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, జమ్మిగడ్డ లోని మురుగు నీటి శుద్ధి కేంద్రం, మినీ ట్యాంక్ బండ్ పైలాన్, ఐలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలను సీఎం ప్రారంభించనున్నారు.