- కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థులే ఖరారు కాలే.. కానీ బరిలో నిల్చేది తామేనని నేతల ప్రచారం
- అయోమయంలో సూర్యాపేట జిల్లా క్యాడర్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి బరిలో నిల్చేది తామేనని ఎవరికివారు ప్రచారం షురూ చేశారు. దీంతో టికెట్ దక్కేదెవరికో... అసలైన అభ్యర్థి ఎవరో తెలియక ఆ పార్టీల క్యాడర్ అయోమయానికి గురవుతోంది. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో కాంగ్రెస్ నుంచి హుజూర్ నగర్, కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతికి టికెట్ ఖరారు చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థులను ప్రకటించాలేదు. సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, సీనియర్ లీడర్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మధ్య పోటీ నెలకొనడంతో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
తుంగతుర్తి కాంగ్రెస్ లో 23 మంది టికెట్ కోసం దరఖాస్తులు పెట్టుకోగా అందులో ముగ్గురి మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయినందున అభ్యర్థిని ఖరారు చేయడంలో మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సూర్యాపేట అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వరరావు పేరు దాదాపు ఖరారు కాగా కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి నియోజక వర్గాల అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి కోసం ఇంకా వేటకొనసాగుతోంది.
ఇటీవల చల్లా శ్రీలతారెడ్డి హుజూర్ నగర్ అధికార పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో దాదాపు టికెట్ ఆమెకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోదాడ టికెట్ కోసం పది మందికి పైగా దరఖాస్తు చేసుకోగా వారిలో ఐదుగురిని ఎంపిక చేశారు. అందులో ఒక్కరిని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థి బరిలో ఉండడంతో బీజేపీ నుంచి బీసీని ఉంచాలా, ఓసీని బరిలోకి దింపాలా అని వెనుకముందు అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రజల్లోకి ఆశావహులు..
అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మిగతా పార్టీల ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదం ఉందని టికెట్ కేటాయింపుతో సంబంధం లేకుండా ఎవరికివారు ఆశావహులు ప్రజల్లోకి వెళ్తున్నారు. టికెట్ తనదేనని, తనను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు గురువారం సూర్యాపేట నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నుంచి పటేల్ రమేశ్ రెడ్డి షురూ చేశారు. తుంగతుర్తి నుంచి పిడమర్తి రవి రెండు రోజుల కింద తనకే టికెట్ ఖరారు అయిందంటూ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
హుజూర్ నగర్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న చల్లా శ్రీలతారెడ్డి కూడా రెండు రోజుల కిందనే హైదరాబాద్ లో కషాయం కండువా కప్పుకుని అప్పుడే నియోజకవర్గం నాయకులతో కలిసి ప్రజల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా ఫైనల్గా బరిలో నిలిచే అభ్యర్థి ఎవరో తెలియక ఆ పార్టీల క్యాడర్ అయోమయంలో పడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు.